Punganur: టీడీపీ కార్యకర్త దారుణ హత్య
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:07 AM
కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఆయన ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు.

పట్టపగలు.. ఇంటి ముందే వేటకొడవలితో
నరికి చంపిన పెద్దిరెడ్డి అనుచరుడు
ప్రాణహానిపై ముందే ఫిర్యాదు చేసినా
స్పందించని పోలీసు అధికారులు
పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్థుల ధర్నా
పుంగనూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న టీడీపీ నేతల హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఆయన ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ కార్యకర్త, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వెంకటరమణ వేట కొడవలితో అత్యంత పాశవికంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తాజాగా జరిగిన ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెంకటరమణ నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని 15 రోజుల కిందట రామకృష్ణ రికార్డు చేసిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, విధి నిర్వహణలో విఫలమయ్యారంటూ పుంగనూరు సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేశారు.
ఏం జరిగింది?
పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీలోని కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ(50) కొన్ని దశాబ్దాలుగా టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు గతేడాది ప్రమాణ స్వీకారం చేసే సమయంలో షాపు ఎదుట వేడుకల కోసం కేక్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్త త్రిలోక్ బైక్‌పై వచ్చి ఆ కేక్‌ను ధ్వంసం చేయడంతో రామకృష్ణ భార్య దేవమ్మ అడ్డుకున్నారు.
దీంతో ఆమెను బైకుతో ఢీకొట్టడంతో ఆమె కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామకృష్ణ తన పొలంలోకి మట్టి తరలిస్తుంటే, వైసీపీ కార్యకర్త వెంకటరమణ తన ఇంటి ఎదుట నుంచి మట్టి ట్రాక్టర్ వెళ్లిందని ఆరోపిస్తూ గొడవకు దిగారు. ఇది ఘర్షణగా మారి పరస్పరం కొట్టుకున్నారు. పుంగనూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. దాన్ని మనసులో పెట్టుకుని వైసీపీ కార్యకర్త వెంకటరమణ 15 రోజుల కిందట రామకృష్ణ పెద్ద కొడుకు శివతో మళ్లీ గొడవ పడి చెయ్యి విరిచారు. ఆ సమయంలో రామకృష్ణను సైతం కొట్టారు. దీంతో పుంగనూరు పోలీసులకు రామకృష్ణ వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ‘ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తుంటా’వని రామకృష్ణనే మందలించి పంపించేశారు.
ప్రాణహాని అంటూ వీడియో
మానసిక క్షోభతో రామకృష్ణ కొన్ని రోజుల కిందట ఓ వీడియో విడుదల చేశారు. ‘టీడీపీ అధికారంలోకి వచ్చినా పార్టీ కోసం పనిచేసిన మాకు పోలీసులు న్యాయం చేయడం లేదు. మా అబ్బాయి చేయి విరిచినా స్పందించడం లేదు. అంతకుముందు నిందితుల్ని పట్టుకొచ్చినా వెంటనే వదిలేశారు. మాకు వెంకటరమణతో ప్రాణహాని ఉంది.’’ అని వీడియోలో పేర్కొన్నారు.
వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి..
కృష్ణాపురంలో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపు జరుగుతుండగా.. పోలీసుల సమక్షంలోనే రామకృష్ణతో వెంకటరమణ గొడవకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను మందలించి పంపించేశారు. వరుస సంఘటనల నేపథ్యంలో రామకృష్ణను చంపాలని ప్లాన్ చేసిన వైసీపీ కార్యకర్త, మాజీ వలంటీర్ వాణి భర్త వెంకటరమణ శనివారం ఉదయం గోనె సంచిలో వేట కొడవలి పెట్టుకుని రామకృష్ణ షాపు వద్దకు వచారు. రామకృష్ణ చిన్న కొడుకు సురేశ్ అక్కడ ఉండడంతో సంచిలో నుంచి కొడవలి తీసి దాడి చేశాడు. సురేశ్ తప్పించుకుని చేతులు అడ్డు పెట్టడంతో వేట కొడవలి బలంగా చేతులకు తగిలి గాయాలయ్యాయి. దీంతో సురేశ్ పరుగులు తీసి బైకుపై పారిపోయాడు. పొలం పనులు చేసుకుంటున్న రామకృష్ణకు విషయం తెలిసి ట్రాక్టర్‌పై ఇంటికి వచ్చారు. ట్రాక్టర్ దిగే సమయంలోనే రామకృష్ణ తొడపై, కాళ్లపై వేట కొడవలితో వెంకటరమణ విచక్షణారహితంగా దాడి చేశారు. తర్వాత మెడపై నరికి పారిపోయారు. రక్తపు మడుగులో పడిన రామకృష్ణను కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి బయల్దేరగా మార్గమధ్యంలోనే రామకృష్ణ మృతి చెందారు. కాగా, రామకృష్ణ హత్య ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని కృష్ణాపురం గ్రామస్థులు ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగారు. మదనపల్లె ఆస్పత్రి వద్ద కూడా పోలీసుల వైఫల్యంపై ధర్నా చేశారు. ‘హత్య చేసిన వెంకటరమణను చంపితేనే నా భర్త మృతదేహాన్ని తీసుకెళ్తామ’ని రామకృష్ణ భార్య దేవమ్మ మదనపల్లె ఆస్పత్రిలో రోదించారు. కాగా, ఈ హత్య వెనుక వ్యక్తిగత, రాజకీయ కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఎస్పీని సస్పెండ్ చేయాలి: అమరనాథ్‌రెడ్డి
చిత్తూరు జిల్లా ఎస్పీ తీరు సరిగా లేదని, అందుకే టీడీపీ నాయకుల ప్రాణాలు పోతున్నాయని, ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో కూడా వైసీపీతో అంటకాగిన పోలీసులే ఇంకా పనిచేస్తున్నారని చెప్పారు. ఎస్పీ మణికంఠకు చెప్పినా బదిలీ చేయలేదని, దీంతో ఆయనకు ఫోన్ చేయడమే మానేశానన్నారు. ‘‘సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందనే కారణంగా సైలెంట్‌గా ఉన్నాం. లేకుంటే పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి తరిమికొడతాం’’ అని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఇదిలావుంటే, పలమనేరు, చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, పులివర్తి నాని, మురళీమోహన్, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి మదనపల్లె ఆస్పత్రిలో రామకృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు. హోంమంత్రి అనిత మృతుడి కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.