Share News

Heavy Rainfall Alert: రేపు మరో అల్పపీడనం

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:55 AM

రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణాది వైపు కొనసాగుతోంది. శనివారం నాటికి ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించింది.

Heavy Rainfall Alert: రేపు మరో అల్పపీడనం

  • 24న మరొకటి ఏర్పడే అవకాశం

  • కోస్తా, సీమకు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • ఉత్తర కోస్తా రేవుల్లో మూడో నంబరు హెచ్చరిక

  • మత్స్యకారులు సంద్రంలో వేటకు వెళ్లొద్దని సూచన

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణాది వైపు కొనసాగుతోంది. శనివారం నాటికి ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించింది. దీనికి తోడు ఛత్తీస్‌గఢ్‌పై అల్పపీడనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు ఉత్తర కోస్తాపైకి వీస్తుండడంతో శనివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చిరుజల్లుల నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. కాగా, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుం టూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ద్రోణి, అల్పపీడనం ప్రభావాలతో సో మవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృ ష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అ ల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నా డు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 19న అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అతిభారీ, కోస్తాలో శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఈనెల 24న వాయవ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

Updated Date - Aug 17 , 2025 | 03:57 AM