Meteorological Department: రేపు మరో అల్పపీడనం
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:10 AM
పశ్చి మ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి జార్ఖండ్ వైపు పయనించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
26 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు
విశాఖపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పశ్చి మ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి జార్ఖండ్ వైపు పయనించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మన రాష్ట్రంపై ఎటువంటి ప్రభావమూ చూపదని పేర్కొంది. అలాగే, ఈనెల 25న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దాని ప్రభావంతో 26 నుంచి ఉత్తర కోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ, ఉక్కపోత కొనసాగాయి. బాపట్లలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.