Cyclone Formation: నేడు మరో అల్పపీడనం
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:26 AM
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి.
రేపటికి వాయుగుండంగా మార్పు!
ఎల్లుండి ఉత్తరాంధ్ర వద్ద తీరంపైకి.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ
విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. కాగా, మయన్మార్, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దాని ప్రభావంతో గురువారం నాటికల్లా ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా బలపడి శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఇది శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో గురువారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాలో, శుక్ర, శనివారాలు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గురువారం శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకూ అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. శుక్రవారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీగా, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుంచి కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, సముద్రంలో ఉన్న వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించింది. కాగా, గురువారం కోస్తా జిల్ల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, తర్వాత రెండు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబటి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణానదిలో వరద ప్రవాహం 4.55 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని తెలిపింది. గోదావరిలో ధవళేశ్వరం వద్ద 3.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, రానున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.