Share News

YSRCP Political Drama: మరో జగన్నాటకం

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:41 AM

ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో పాట అమరావతి’పై వైసీపీ ఇప్పటికే ఒకసారి జనాన్ని మాయ చేసింది. ఇప్పుడు మరోసారి అదే చేస్తోంది. ఈసారి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెరపైకి వచ్చారు.

YSRCP Political Drama: మరో జగన్నాటకం

  • ‘అమరావతి’పై మళ్లీ బూటకం

  • ఈసారి సజ్జల మాయ మాటలు జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్లరు

  • ‘ఇక్కడి నుంచే’ పాలన సాగిస్తారు

  • రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి విలువ పెంచుతాం

  • అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు

  • సచివాలయం, భవనాలు ఉన్నాయి కదా

  • కొత్త నిర్మాణాలు అవసరం లేదు

  • ఇవీ సజ్జల రామకృష్ణా రెడ్డి సుద్దులు

  • 2019కి ముందునాటి డ్రామా మళ్లీ మొదలు

  • నాడు అధికారంలోకి రాగానే ‘3 ముక్కలాట’

  • రాజధాని రైతులపై పగబట్టి వేధింపులు

  • అమరావతి ఎడారి, శ్మశానం అంటూ ఎద్దేవా

  • ఇప్పుడు అవన్నీ మరిచి ‘రివర్స్‌ ప్రేమలు’

జనులారా జాగ్రత్త!

అదే బూటకం! మళ్లీ అదే మాయ నాటకం! ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై కసి! రాష్ట్ర అభివృద్ధిపై కక్ష! ఇదే... జగన్‌ పార్టీ విధానం! అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది! 2019 ఎన్నికల ముందు ‘అమరావతే రాజధాని’ అని ప్రకటించి... అధికారంలోకి రాగానే ‘మూడు ముక్కలాట’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు... ‘ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే పాలిస్తారు’ అని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా... ‘విశాఖ పాలనా రాజధాని’ అని ఊదరగొట్టి, ఉత్తరాంధ్ర సెంటిమెంటు రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు... ‘విశాఖ వెళ్లం. ఇక్కడే ఉంటాం’ అని సజ్జల చెప్పడం గమనార్హం. అంతేకాదు... ‘అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు, అది ఎడారి, శ్మశానం’ అని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... సజ్జల రామకృష్ణా రెడ్డి ‘‘అమరావతిలో రాజధాని ఉంది కదా! సచివాలయం కూడా ఉంది’’ అని చెప్పారు.


కొత్తవి వద్దంటే...

అమరావతిని కొత్త నగరంగా... దేశానికే తలమానికంగా నిర్మించాలన్నది చంద్రబాబు సంకల్పం. దీనికి అనుగుణంగానే ప్రణాళికలను సిద్ధం చేశారు. 2019లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చినా... లేక, జగన్‌ సర్కారు ఆ పనులను కొనసాగించినా ఈపాటికే ‘అమరావతి’ సాక్షాత్కరించేది. కానీ... జగన్‌ ఐదేళ్లు అమరావతిని పాడుపెట్టి, పూర్తిగా సర్వనాశనం చేయాలని ప్రయత్నించారు. వేసిన పునాదులు గట్టివి కాబట్టి, చేసిన పనులు నాణ్యమైనవి కాబట్టి ఆ భవనాలు అలాగే దృఢంగా నిలబడ్డాయి. ఇప్పుడు... సజ్జల మైకు పట్టుకుని, ‘ఆ భవనాలు చాలు. కొత్తవి కట్టక్కర్లేదు’ అని సుద్దులు చెబుతున్నారు. రాజధాని అంటే ఒక్క సచివాలయమే కాదు. సకల వర్గాల జీవన ప్రమాణాలు, అభివృద్ధిని ప్రతిబింబించే నిర్మాణాలు ఉంటాయి. అవేవీ వద్దనడం వైసీపీ వైఖరికి అద్దం పడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు ఒక మాట! అధికారంలోకి వచ్చాక మరో పాట! ‘అమరావతి’పై వైసీపీ ఇప్పటికే ఒకసారి జనాన్ని మాయ చేసింది. ఇప్పుడు మరోసారి అదే చేస్తోంది. ఈసారి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెరపైకి వచ్చారు. శుక్రవారం ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ‘ఈ దఫా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ మళ్లీ మీరొస్తే మార్చరు కదా!’ అన్న ప్రశ్నకు.. ‘‘ఇప్పటికే రాజధాని ఉంది కదా! సచివాలయం ఉంది. ఆయన (చంద్రబాబు) కొత్తవి కట్టకపోతే చాలు. ఉన్నదాంతో నడుపుకోవచ్చు’’ అని సజ్జల అన్నారు. ‘అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు, అది ఎడారి, శ్మశానం’ అని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... సజ్జల రామకృష్ణా రెడ్డి ‘‘అమరావతిలో రాజధాని ఉంది కదా! సచివాలయం కూడా ఉంది’’ అని చెప్పడం గమనార్హం. ఇక... రాజధాని రైతులను పగవాళ్లుగా భావించి, వారిని అన్నిరకాలుగా హింసించిన జగన్‌ సర్కారుకు ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల... ఇప్పుడు అదే అమరావతి రైతులపై కపట ప్రేమను ప్రదర్శించారు. ‘‘మేం రైతుల రిటర్నబుల్‌ ప్లాట్ల అభివృద్ధి పూర్తి చేసే వాళ్లం. ఈసారి రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి, వాటి సేలబులిటీ పెంచుతాం’’ అని రెండో నాల్కను బయట పెట్టారు.


ఆ అరాచకం మరిచిపోయారా?

వైసీపీ అధినేత జగన్‌ 2019 ఎన్నికలకు ముందు గుంటూరులో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. రాజధానిగా అమరావతే ఉంటుందని నమ్మబలికారు. అందుకే తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాననీ చెప్పారు. ‘ఒక్కచాన్స్‌’ అని వేడుకున్నారు. ప్రజలు అధికారం ఇవ్వగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అమరావతిని అటకెక్కించి ‘మూడు ముక్కలాట’కు తెరలేపారు. ఆ తర్వాత అమరావతి విధ్వంసానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. క్యాబినెట్‌ సమావేశాలున్నప్పుడు మినహా... మరెన్నడూ సచివాలయానికేసి చూడలేదు. హైకోర్టు తీర్పులతోనూ జగన్‌ తీరు మారలేదు. ప్రాం తాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించారు. అమరావతిపై నాటకాలతోపాటు... ఐదేళ్ల అరాచకాలపై జనం మండిపోయారు. ఎన్నికల్లో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేశారు. ఆపై ఏడాదిన్నరకే సజ్జల రామకృష్ణా రెడ్డి నోట అమరావతిపై కొత్త పాట వినిపించడం గమనార్హం!

అమరావతిపై వైసీపీ కసి, ద్వేషం ఏమా త్రం తగ్గలేదన్నది నిజం. అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవద్దం టూ సింగపూర్‌ ప్రతినిధులకు లేఖలు పంపారు. ఇక రాష్ట్రాభివృద్ధిపైనా వైసీపీది ‘విధ్వంసం-2.0’ విధానమే. మెడికల్‌ కాలేజీల విషయంలో జగన్‌ జారీ చేసిన హెచ్చరికలే దీనికి నిదర్శనం. జగన్‌ పూర్తి చేయకుండా వదిలేసిన, పునాదులకే పరిమితం చేసిన పది మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధిచేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. దీనిపై వైసీపీ అధినేత జగన్‌ హెచ్చరికలకు దిగారు. ఆ టెండర్లలో పాల్గొనొద్దు అని సూటిగా ‘వార్నింగ్‌’ ఇచ్చారు. అధికారంలో ఉండగా... సింగపూర్‌ ప్రభుత్వాన్నే బెదిరించి, భయపెట్టి అమరావతి ప్రాజెక్టు నుంచి తరిమేశారు. ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు. కానీ... ‘మేం అధికారంలో ఉండగా ఒక్క పారిశ్రామిక వేత్తనూ వెళ్లగొట్టలేదు’ అని ఇప్పుడు సజ్జల సుద్దులు చెబుతున్నారు.


ఈ హెచ్చరికతో మళ్లీ భయాలు

మళ్లీ అధికారంలోకి వస్తే ‘విధ్వంసం 2.0’ చూపిస్తామని జగన్‌ ఇప్పుడు చెప్పకనే చెబుతున్నారు. దీంతో... ‘అమ్మో మళ్లీ జగనా’ అని సామాన్య ప్రజలు, వ్యాపార, వాణిజ్య, పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు.

సజ్జల కట్టిన ‘గాలి మేడలు’

విజయవాడను తాము చాలా అభివృద్ధి చేశామని సజ్జల రామకృష్ణా రెడ్డి లేని గొప్పలు చెప్పుకొన్నారు. ‘విజయవాడలో కొత్త ఫ్లై ఓవర్లు పూర్తి చేశాం. అమరావతిని అనుసంధానించే పశ్చిమ బైపాస్‌ రోడ్డును మేమే వేశాం. చివరికి చంద్రబాబు ఇంటి ముందు కరకట్ట రోడ్డు కూడా మేమే వేశాం’’ అని సజ్జల పేర్కొన్నారు. అసలు వాస్తవమేమిటంటే... కరకట్ట రోడ్డు అభివృద్ధికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జగన్‌ వచ్చాక వాటిని పక్కన పెట్టారు. ఇప్పటికీ అక్కడ సింగిల్‌ రోడ్డే ఉంది. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్లన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, చొరవ తీసుకుని... కాంట్రాక్టు సంస్థను కదిలించి పూర్తి చేయించింది. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్లను సీఎం హోదాలో ప్రారంభించేందుకు జగన్‌ సిద్ధమైనా... కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించలేదు. ఆయన ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఇక.. వెస్ట్‌ బైపాస్‌ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే. ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టు. అలైన్‌మెంట్‌ కూడా అప్పుడే నిర్ణయించారు. రాజధాని ఆ తర్వాతే వచ్చింది. కాంట్రాక్టు సంస్థను ఒప్పించి ఈ పనులను పూర్తి చేయించేందుకు అప్పుడే టీడీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేసింది. కోర్టు వివాదాలు, ఆ తర్వాత పరిష్కారాలతో పనులు ముందుకు సాగాయి. అంతేతప్ప... ఇది జగన్‌ సర్కారు చేపట్టిన ప్రాజెక్టు కాదు. సజ్జల చెప్పినట్లుగా రాజధానిని అనుసంధానించాలన్న ప్రేమా లేదు.

Updated Date - Sep 13 , 2025 | 04:46 AM