Share News

SIT: లిక్కర్‌ స్కామ్‌లో మరో 13.29 కోట్లు జప్తు

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:02 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(ఏ-1)కి చెందిన మరికొన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

SIT: లిక్కర్‌ స్కామ్‌లో మరో 13.29 కోట్లు జప్తు

  • ఈ ఆస్తులన్నీ ఏ1 రాజ్‌ కసిరెడ్డివే

  • సిట్‌కు ప్రభుత్వం అనుమతి

  • తెలంగాణలో 30 ఎకరాల భూమి

  • గచ్చిబౌలిలో 326 చ.గ. స్థలం

  • మార్కెట్‌ విలువ 50 కోట్లపైనే

  • బ్యాంకు ఖాతాలో మరో 3 కోట్లు

  • ఇప్పటికే పలు ఆస్తులు, నగదు సీజ్‌

  • ఇతర నిందితుల ఆస్తులూ గుర్తింపు

  • మొత్తం విలువ రూ.120 కోట్లు

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(ఏ-1)కి చెందిన మరికొన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అనుమతి మంజూరు చేసింది. ఇందులో రూ.3 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే మార్కెట్‌ విలువ ప్రకారం ఆస్తులు యాభై కోట్లకు పైగా చేస్తాయని తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో గురువారం సిట్‌ అధికారులు పిటిషన్‌ వేయనున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మాచన్‌పల్లి, దామర్లపల్లిలో రాజ్‌ కసిరెడ్డి పేరుతో కొనుగోలు చేసిన 27.06 ఎకరాల భూమి, అతడి తల్లి సుభాషిణి పేరుతో కొన్న 3.14 ఎకరాల భూమి జప్తునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే రాజ్‌ కుమార్తె పేరుతో ఉన్న ఈశానీ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట గచ్చిబౌలిలో కొనుగోలు చేసిన 326 చదరపు గజాల స్థలాన్ని జప్తు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ రెండు ఆస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం 10.29కోట్లు ఉంది. ఇప్పటికే సిట్‌ గుర్తించి అటాచ్‌ చేసిన భూమి కొనుగోలు వ్యవహారంలో జరిగిన లావాదేవీల్లో విక్రేతలు కౌశిక్‌ కుమార్‌, అభిషేక్‌ అగర్వాల్‌ తిరిగి చెల్లించిన సొమ్ము బ్యాంకు ఖాతాను సైతం సిట్‌ సీజ్‌ చేయనుంది.


రాజ్‌ కసిరెడ్డి బినామీ కంపెనీల్లో ఒకటైన యూఎన్‌ఐ కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యాంకు ఖాతాకు అగర్వాల్‌ రూ.3కోట్లు తిరిగి పంపించారు. పైమూడు ఆస్తుల కొనుగోలుకు వినియోగించింది లిక్కర్‌ ముడుపులేనని సిట్‌ ఆధారాలు సేకరించింది. ఆస్తుల జప్తునకు ఆధారాలతో కోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధ్దమవుతోంది. లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ ఇదివరకే నిందితులకు చెందిన పలు ఆస్తులు, నగదు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. నిందితులతో పాటు డిస్టిలరీలు, బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో నిధులను కూడా సిట్‌ అధికారులు ఫ్రీజ్‌ చేశారు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకూ సుమారు 120 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో రాజ్‌ కసిరెడ్డితో పాటు సహ నిందితులు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బినామీ ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.


లిక్కర్‌ నిందితులకు బెయిల్‌పై 28న తీర్పు: విజయవాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, పైలా దిలీప్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. వాటిపై తీర్పును 28న వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు వెల్లడించారు.

Updated Date - Aug 22 , 2025 | 04:05 AM