Former DG Venkateswara Rao: విద్యుత్ రంగంలో ఏటా లక్ష కోట్ల అవినీతి
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:24 AM
దేశం మొత్తంలో ఏపీలోనే విద్యుత్ రంగంలో అవినీతి ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.
టెండర్ల నుంచి కొనుగోళ్ల వరకు అక్రమాలే: ఏబీవీ
తిరుపతి(విద్య), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దేశం మొత్తంలో ఏపీలోనే విద్యుత్ రంగంలో అవినీతి ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. అవినీతికి ఏపీఎస్పీడీసీఎల్ ప్రయోగశాలగా మారిందన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆ సంస్థ ప్రతినిధి నల్లమోతు చక్రవర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ స్కాం జరుగుతున్న విధానాన్ని వివరించారు. అనంతరం ఏబీవీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ మాఫియా వేళ్లూనుకుని పోయిందని, ఏడాదికి రూ. లక్ష కోట్ల అవినీతి జరుగుతోందని చెప్పారు. టెండర్ల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్ల కొనుగోళ్ల వరకు అన్నింటా అవినీతి పేరుకుపోయిందన్నారు. తెలంగాణ 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను రూ.87,791కు, ఛత్తీస్‌గఢ్ రూ. 75,496కు కొంటే ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలైలో రూ. 1,39,173కు కొనుగోలు చేసిందని, కూటమి ప్రభుత్వం రూ.1,19,073కు కొనుగోలు చేసిందన్నారు. వ్యవసాయానికి అవసరంలేని ఫైవ్‌స్టార్ 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రస్తుత ప్రభుత్వం రూ.1,40,085కు కొనుగోలు చేస్తోందని చెప్పారు.పోటీ లేకుండా కేవలం షిర్డీసాయి, తోషిబా కంపెనీలకే టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అవినీతి వల్ల కరెంటు చార్జీలు పెరిగిపోతున్నాయని చెప్పారు.