District Reorganization: మదనపల్లె బదులు అన్నమయ్య
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:18 AM
అన్నమయ్య పేరుతో జిల్లా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు
స్వరూపంలో భారీ మార్పు
రాయచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా
కడపలోకి రాజంపేట.. తిరుపతిలోకి రైల్వేకోడూరు
మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితం
కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు
మదనపల్లె జిల్లాగా ఉండదు.. ఇది అన్నమయ్యలోకి..
నెల్లూరులోకి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు
రాపూరు, సైదాపురం, కలువాయి కూడా..
తిరుపతిలోనే వాకాడు, చిట్టమూరు మండలాలు
మార్కాపురంలోనే పొదిలి.. ప్రకాశంలోనే దొనకొండ,కురిచేడు.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య పేరుతో జిల్లా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న జిల్లా భౌగోళిక స్వరూపం దాదాపుగా మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. ఇదివరకే ప్రకటించిన మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాను అన్నమయ్య జిల్లాగా వ్యవహరిస్తారు. రాయచోటి కూడా ఇదే జిల్లాలో ఉంటుంది. దీంతో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న కొందరి డిమాండ్లకు, రాయచోటినే కొనసాగించాలన్న ఆందోళనలకు తావివ్వకుండా మదనపల్లె హెడ్‌క్వార్టర్స్‌గా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తారు. కొత్తగా ప్రకటించినట్టు మదనపల్లె జిల్లా పేరు మాత్రం ఉండదు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన రాయచోటి అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. రెవెన్యూ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం సోమవారం ఫైలు పంపించనుంది. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఈ విషయంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మంత్రివర్గ భేటీలో ఏదైనా అనూహ్య చర్చ జరిగి ముఖ్యమంత్రి మార్పులు సూచిస్తే ఆ దిశగా సవరణలు ఉంటాయి.
ఏ మార్పులూ ప్రతిపాదించకపోతే ఇదే పద్ధతిలో అన్నమయ్య జిల్లా స్వరూపం ఉంటుందని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి అనిత, రెవె న్యూ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్‌కాల్ ద్వారా మీటింగ్‌లో పాల్గొన్నారు.
అన్నమయ్యపై విస్తృత చర్చ
తొలుత అన్నమయ్య జిల్లా అంశంపైనే భేటీలో చర్చ జరిగింది. శనివారం నాటి సమావేశంలో అన్నమయ్య జిల్లాను రద్దు చేసి అందులోని రాజంపేటను కడపలోకి, రాయచోటిని మదనపల్లె జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఆదివారం భేటీలోని ఈ విషయంపై చర్చించారు. మారిన పరిస్థితుల నేపఽథ్యంలో అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోయే మదనపల్లెను ప్రధాన కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పునర్వ్యవస్థీకరించాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో అన్నమయ్య జిల్లాను రద్దు చేయాల్సిన అవసరం ఉండదని, మదనపల్లె జిల్లా ఏర్పాటుకు ఏ సమస్య ఉండదని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక రాజంపేట, రాయచోటి మధ్య హెడ్‌క్వార్టర్స్ వివాదం కూడా సమసిపోతుందని అధికారులు విశదీకరించారు. ఈ ప్రతిపాదన మధ్యేమార్గంగా ఉండటంతో సీఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రధాన కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటిని కొనసాగించాలని నిర్ణయించారు. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఒక దశలో అన్నమయ్య జిల్లాగానే కొనసాగించాలన్న సమాలోచనలు సాగాయి. ఒక్క రాయచోటి డివిజన్ కోసం జిల్లాను కొనసాగించడం సహేతుకం కాదని అధికారులు పేర్కొన్నారు.
పోర్టు సమీకరణాలతో నిర్ణయాలు
ప్రస్తుతం గూడూరు డి విజన్ తిరుపతి జిల్లాలో ఉంది. ఈ డివిజన్‌లోని వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ 2మండలాలు తిరుపతి జిల్లాలో ఉండటం వల్ల దుగరాజపట్నం పోర్టు ఆ జిల్లాలో ఉంటుంది. దీంతో రాయలసీమకు కూడా పోర్టు ఉన్నట్లవుతుంది. గూడూరు డివిజన్‌లోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాలను తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మూడు మండలాలను తిరుపతి నుంచి నెల్లూరులోకి తీసుకురావడంవల్ల కృష్ణపట్నం పోర్టు ఇదే జిల్లాలో ఉన్నట్లువుతుందని భావిస్తున్నారు. ఇక తిరుపతి జిల్లాలో ఉన్న కలువాయు, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి నెల్లూరులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో తాజా సమావేశంలో మంత్రులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్నమయ్య జిల్లాలో మార్పులు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మండలాల పునర్వ్యవస్థీకరణ, తాజా ప్రతిపాదనలకు జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ సమ్మతి తెలిపినట్లు తెలిసింది.
29 కాదు... 28 జిల్లాలే
రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 29కు చేరింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మదనపల్లె పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం లేదు. అన్నమయ్య పేరిట ఉన్న జిల్లాకే మదనపల్లె హెడ్‌క్వార్టర్స్‌గా ఉండనుంది. ప్రతిపాదిత మదనపల్లె జిల్లా ప్రాంతం ఇందులోనే ఉండనుంది. దీంతో జిల్లాల సంఖ్య 28కు పరిమితమైంది. పోలవరం జిల్లా కూర్పులో ఎలాంటి మార్పులేదు. కొత్తగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో పొదిలి ఉంది. దాన్ని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. కురిచేడు, దొనకొండ మండలాలను ప్రకాశంలోనే కొనసాగించనున్నారు. ఈ సమావేశానికి ప్రకాశం కలెక్టర్ రాజాబాబును కూడా పిలిచారు. పొదిలి, కురిచేడు మండలాల అంశంపై ఆయన అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ రెండు మండలాలపై రెవెన్యూ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ సిఫారసులకే సీఎం మొగ్గుచూపినట్లు తెలిసింది.