District Reorganization: అన్నమయ్య.. అటూ ఇటూ
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:55 AM
ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తారు...
మూడు ముక్కలైన జిల్లా.. ఇక మదనపల్లె కేంద్రం
కొత్తగా మార్కాపురం, పోలవరంకడప, తిరుపతి, నెల్లూరు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ మొత్తం జిల్లాలు 28
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. మదనపల్లె పేరుతో జిల్లా ఉండదు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. ప్రస్తుతమున్న అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతారు. మిగిలిన రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతనెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపఽథ్యంలో మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుం ది. రెవెన్యూ శాఖ కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తొలి నోటిఫికేషన్‌లో 5రెవెన్యూ డివిజన్లు అద్దంకి (ప్రకాశం), మడకశిర (సత్యసాయి), బనగానపల్లె (నంద్యాల), పీలేరు (మదనపల్లె), నక్కపల్లి (అనకాపల్లి) ప్రతిపాదించారు. అయితే నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్‌ను డివిజన్‌గా ప్రతిపాదించారు.

అన్నమయ్య జిల్లా..
అన్నమయ్య జిల్లా పేరు కొనసాగుతుంది. కానీ స్వరూపమే మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటు ంది. కానీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్యలో రాయచోటి కొనసాగుతుంది.
పలమనేరు డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె డివిజన్‌లో విలీనం చేస్తారు.
పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె మండలాలను రాయచోటి డివిజన్ నుంచి తీసి కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్‌లో కలుపుతారు.

తిరుపతిలోకి..
చిట్టమూరు, వాకాడ మండలాలను తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట డివిజన్‌లోనే కొనసాగిస్తారు.
రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోని కో డూరు, పెంగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మం డలాలను తిరుపతి జిల్లాలో విలీ నం చేసి తిరుపతి రెవెన్యూడివిజన్‌లో కలుపుతారు.

నెల్లూరు జిల్లాలోకి..
తిరుపతి జిల్లాలో ఉన్న గూడూ రు డివిజన్‌లోని గూడూ రు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతారు.
ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం నెల్లూరు జిల్లాలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారు. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూ రు డివిజన్‌లో కొనసాగిస్తారు.
కందుకూరు డివిజన్‌లోని వరికుంటపాడు, కొండాపురం మండలాలను నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌లో విలీనం చేస్తారు.

కడపలోకి..
రాజంపేట డివిజన్‌తో పాటు నందలూరు, వీరబల్లె, టి. సుండుపల్లె మండలాలను కడప జిల్లాలో విలీనం చేస్తారు.
సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలోనే కొనసాగిస్తారు.
ప్రకాశంలోకి..
కనిగిరి డివిజన్‌లో ఉన్న దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు అద్దంకి డివిజన్ లో ఉంటాయి. అద్దంకిని ప్రకాశంలోకి తీసుకొచ్చి కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తారు.
రెండుగా ఆదోని మండలం
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీన్ని మార్చారు. పెద్ద హరివనం మండలం ఉండదు. దాని స్థానంలో ఆదోని-2 మండలం ఉంటుంది.