Annamayya District: రద్దుబాటలో అన్నమయ్య
ABN , Publish Date - Dec 28 , 2025 | 03:49 AM
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య రద్దుబాటలోకి వస్తోంది.
రాయచోటి ప్రతిపాదిత మదనపల్లెకు.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు
రాయచోటి జిల్లా కేంద్రంపై అభ్యంతరాలు.. పరిగణనలోకి తీసుకోవాలన్న సీఎం
కొత్త జిల్లాలు, డివిజన్లపై 927 వినతులు.. పోలవరం, మార్కాపురం, మదనపల్లె ఓకే
ఇక మొత్తం జిల్లాలు 28.. రెవెన్యూ డివిజన్‌గా నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్
నేడు సీఎం వద్ద మరోసారి భేటీ.. మార్పులపై తుది నిర్ణయం.. అనంతరం క్యాబినెట్‌కు
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ప్రస్తుతమున్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య రద్దుబాటలోకి వస్తోంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రద్దుల పద్దులోకి తీసుకురావాలనుకుంటోంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి అనిత, రెవెన్యూ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అన్నమయ్య జిల్లా ను రద్దు చేసి అందులోని డివిజన్లు, మండలాలను కడప, తిరుపతితో పాటు కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలనుకుంటున్నారు. దీనిపై ఆదివారం మరోసారి సీఎం దగ్గర జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశం ఆమోదానికి పంపించనున్నారు. జిల్లాల జాబితాలో నుంచి అన్నమయ్యను తొలగిస్తే, కొత్తగా ఏర్పాటు చేసే మూడింటితో కలిపి మొత్తం జిల్లాలు 28 ఉంటాయి. మరోవైపు డివిజన్ల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని స్వల్పమార్పులు ప్రతిపాదించారు.
ప్రజాభిప్రాయం మేరకే..
రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆరు రెవెన్యూ డివిజన్లు, ఓ కొత్త మండలం ఏర్పాటుపై కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నెల రోజుల పాటు ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరించింది. అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజల నుంచి 927 వినతులు వచ్చాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను ప్రధాన కేంద్రంగా చేయాలని కొందరు.. లేనిపక్షంలో కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించవద్దని మరి కొందరు కోరుతున్నారు. ఈ సమస్య మొదటి నుంచి ఉంది. అయితే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మారిస్తే రాజీనామా చేస్తానని ఆ జిల్లా మంత్రి ప్రకటించినట్లుగా వార్తలొచ్చాయి. దీంతో సమస్యను పెద్దదిగా మార్చకూడదని ప్రభుత్వం తొలుత వెనక్కి తగ్గింది. కానీ, ప్రభుత్వానికి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాల్లో సింహభాగం రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తప్పించాలన్నవే ఉన్నాయి. మరోవైపు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌పై ప్రజలు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాలను క్రోడీకరించి రెవెన్యూ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా కదిలించాలని రాజంపేట వాసులు, కదిలించొద్దని స్థానికులు పోటాపోటీ డిమాండ్లు చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లె జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీనివల్ల ఆయా ప్రాంతాలు తమకు నచ్చిన జిల్లాలో కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కేంద్రం విషయంలో విబేధాలు, వైషమ్యాలకు చెక్ పెట్టినట్లు అవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశంపై తుది సమావేశం నిర్వహించి ప్రతిపాదనలను ఖరారు చేయనున్నారు.
మొత్తం జిల్లాలు 28
ప్రస్తుతం అన్నమయ్య జిల్లాతో కలిపి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 29కు చేరింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కు పరిమితం కానుంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం-1974 అమల్లోకి వచ్చిన తర్వాత పలు దఫాలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ అమల్లో ఉన్న జిల్లాను రద్దు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఓ జిల్లాను రద్దు చేయనున్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లపై ప్రజల నుంచి పెద్దగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాలేదని తెలిసింది. దీంతో ఆ జిల్లాల ఏర్పాటుపై తుది గెజిట్ నోటిఫికేషన్లు ఇస్తారు.
గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు తిరుపతి జిల్లాలో విలీనం చేసిన 3 మండలాలను తిరిగి నెల్లూరులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి తీసుకొస్తారు.
ఇప్పటికే సిద్దవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేసేలా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పుడు వీటికి తోడు రాజంపేటను కూడా కడపలోకి తీసుకువస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రాఽథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేల మధ్య విబేధాల నేపఽథ్యంలో అడ్డరోడ్డు జంక్షన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిపాదిత నక్కపల్లి డివిజన్‌లోనే అడ్డరోడ్డు జంక్ష్షన్ ఉంది. ఇప్పుడు దాన్నే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు.
మునగపాకను అనకాపల్లి డివిజన్‌లో, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని నిర్ణయించారు.
రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎలాంటి మార్పులూ లేవు.