BJP Ex President Annamalai: కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపిన ధీశాలి వాజపేయి
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:46 AM
వాజపేయి జీవితం.. విలువల విశ్వసనీయతకు నిదర్శనం. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపిన ధీశాలి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొనియాడారు.
బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై
ఏలూరు, భీమవరంలలో వాజపేయి విగ్రహాల ఆవిష్కరణ
ఏలూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘వాజపేయి జీవితం.. విలువల విశ్వసనీయతకు నిదర్శనం. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపిన ధీశాలి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి’ అని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొనియాడారు. ఏలూరు ఆశ్రం సర్కిల్ సెంటర్‌లో పార్టీ ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్, ఉపాధ్యకుడు తపన చౌదరిలతో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాజపేయి సేవలకు స్ఫూర్తిగా అటల్-మోదీ సుపరిపాలన యాత్రను నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చొరవ అభినందనీయమని కొనియాడారు. 1999లో ప్రధానిగా వాజపేయి ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలోనే రాష్ట్రంలోనే 19 వాజపేయి విగ్రహాలు ఏర్పాటు కావడం గొప్ప పరిణామమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమాలలో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, మంత్రి కొలుసు పార్థసారఽథి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.