Anna Lezhinova: తిరుమలలో అన్నా లెజినోవా అన్నదానం
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:18 AM
తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట టీటీడీ అన్నప్రసాద వితరణకు రూ.17 లక్షల విరాళం అందజేసిన అన్నా లెజినోవా, స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. తల నీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు.

కుమారుడి పేరిట అన్నప్రసాద పథకానికి రూ. 17 లక్షల విరాళం
తిరుమల, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట తిరుమలలో సోమవారం అన్నప్రసాద వితరణ పథకానికి రూ.17 లక్షల విరాళం అందజేశారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తర్వాత భక్తులందరితో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు సుప్రభాత సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో మొక్కులు చెల్లించేందుకు ఆదివారం తిరుమలకు చేరుకున్న ఆమె డిక్లరేషన్‌పై సంతకం చేసి వరాహస్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే. రాత్రికి తిరుమలలోనే బస చేసిన ఆమె సోమవారం వేకువజామున వైకుంఠం క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత హుండీలో కానుకలు సమర్పించి ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అన్నా లెజినోవాను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.