Anganwadi Workers: సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీల ధర్నా
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:25 AM
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు.

విజయవాడ(ధర్నాచౌక్), మార్చి 10(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన అంగన్వాడీలు పాల్గొన్నారు. వేతనాలను పెంచాలని, గ్రాట్యుటీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినదించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎ్‌స లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పీ ప్రసాద్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుబ్బరావమ్మ తదితరులు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
న్యాయం చేస్తాం... రోడ్డెక్కాల్సిన పని లేదు: ఆచంట సునీత
‘వైసీపీ విషప్రచారంలో పడి అంగన్వాడీలు మోసపోవద్దు. వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది’ అని టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అంగన్వాడీలు రోడ్డెక్కాల్సిన పనిలేదు. వారి న్యాయబద్ధమైన కోర్కెలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుంది’ అని సునీత అన్నారు.