Women and Child Welfare Department: అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:51 AM
అంగన్వాడీల సమస్య పరిష్కారంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సానుకూల నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
గ్రాట్యుటీ ఇచ్చాం.. మినీలను మెయిన్‌గా మార్చాం
నెలలో 5జీ ఫోన్లు.. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వెల్లడి
వేతనాలు వెంటనే పెంచాలి: అంగన్వాడీ సంఘాలు
అమరావతి,ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల సమస్య పరిష్కారంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సానుకూల నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. గ్రాట్యుటీ అమలుకు, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్పునకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇంకా కొన్ని సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అంగన్వాడీలకు నెల రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌తో కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మంగళవారం గుంటూరులోని తన కార్యాలయంలో అంగన్వాడీ సంఘాల నేతలతో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు కె సుబ్బరావమ్మ, లలితమ్మ, జ్యోతి భారతి తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆ వివరాలతో అంగన్వాడీ సంఘాల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని, లేకపోతే మరో ఆందోళనకు సిద్ధమవుతామని సమావేశంలో అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. పోషణ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయనవి మాత్రమే బాల సంజీవని యాప్‌లో చేయాలని డైరెక్టర్ చెప్పారన్నారు. గ్రాట్యుటీ అమలుకు లేబర్ డిపార్ట్‌మెంట్ సలహాతో గైడ్‌లైన్స్ రూపొందుతున్నాయని తెలిపారు. 1810 మంది మినీ వర్కర్ల అర్హతకు మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు. వేసవి సెలవులు నెలరోజులు పాటు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు. జూన్ 2025 వరకు అన్ని రకాల బిల్లులకు బడ్జెట్ ఇచ్చినట్లు తెలిపారన్నారు. పలు జిల్లాల్లో బీఎల్‌వో డ్యూటీ తప్పించేంచుకు హామీ ఇచ్చారన్నారు.