సర్వేకు వెళ్లారట!
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:20 AM
సచివాలయాల్లో సిబ్బంది ఉండరు. ఉన్నవారు సమయానికి రారు. వాస్తవానికి పది గంటలకు సిబ్బంది సచివా లయాల్లో విధులకు హాజరు కావాలి.

ఖాళీగా దర్శనమిస్తున్న సచివాలయాలు
అరకొరగా సిబ్బంది విధులకు హాజరు
అధికశాతం సిబ్బంది
క్షేత్రస్థాయి సర్వేల్లో నిమగ్నం
అందుబాటులో లేక వెనుదిరుగుతున్న ప్రజలు
ఏలూరు టూటౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సచివాలయాల్లో సిబ్బంది ఉండరు. ఉన్నవారు సమయానికి రారు. వాస్తవానికి పది గంటలకు సిబ్బంది సచివా లయాల్లో విధులకు హాజరు కావాలి. కానీ 10:30, 11:00 గంటలకు వస్తారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ‘ప్రభుత్వం సర్వేలన్నీ మా మీదే పెట్టింది. ఇంటింటికి వెళ్ళి సర్వేలు నిర్వహి స్తున్నార.. మార్చి కావడంతో ఆస్తి, కుళాయి పన్నులు, కట్టించుకోవడానికి ఇంటింటికీ తిరుగు తున్నా’ మంటూ దబాయించి చెబుతున్నారు. మరోవైపు సచివాలయాల వద్ద కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేక పనుల మీద వచ్చే జనం ఇబ్బందులు పడుతున్నారు. కార్యాల యాల వద్ద స్వచ్ఛభారత్ ఊసే కానరావడం లేదు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ సచివాలయాల విజిట్‌లో పలు అంశాలు వెలుగు చూశాయి.
సిబ్బంది అంతా సర్వేల్లోనే..
ఏలూరులోని తంగెళ్ళమూడి ఎంఆర్‌సీ కాలనీలో 1, 2, కొత్తపేటలోని 18, 22 నంబర్ల సచివాలయాలను ‘ఆంధ్రజ్యోతి’ ఉదయం 10 గంటల నుంచి విజిట్ చేసింది. ఎంఆర్‌సీ కాలనీ లో 1, 2 సచివాలయాలు ఒకే భవనంలో ఉన్నా యి. ఈ రెండు సచివాలయాల్లో 18 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తూ కన్పించారు. 11 గంటలు దాటినా ఎవరూ రాలేదు. మిగిలిన వారు ఎక్కడా అని అడిగితే అవుట్‌డోర్ సర్వేలో ఆస్తిపన్నుల కలెక్షన్‌లో ఉన్నారని సిబ్బంది తెలిపారు. కొత్తపేట 18వ నంబర్ సచివాల యానికి 10.45 నిమిషాల వరకు తాళాలు వేసే ఉన్నాయి. అనంతరం ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చి తాళాలు తీశారు. మిగిలిన సిబ్బంది గురించి అడగగా వారంతా అవుట్‌డోర్‌లో ఆస్తిపన్నుల వసూలు చేస్తున్నారని సమాధాన మిచ్చారు. 22 సచివాలయంలో తొమ్మిది మంది సెక్రటరీలకు నలుగురే ఉన్నారు. 10.30 గంటల తర్వాత అడ్మిన్ సెక్రటరీ వచ్చారు.
వేచి ఉండాల్సిందే..
పెదవేగి : పెదవేగి సచివాలయానికి ఉద్యోగులు సకాలంలోనే హాజరయ్యారు. కాని సర్వేలతో కార్యాలయాన్ని వీడారు. దీంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు సిబ్బంది లేకపోవడంతో వేచి ఉండే పరిస్థితి ఉంది. పెదవేగి సచివాలయంలో గ్రామ కార్యదర్శితో పాటు మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. వీఆర్వో పెదవేగి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరు గుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో వీఆర్వో కోసం వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు.
రెండు సచివాలయాలకు ఒకే చిన్న గది
ముదినేపల్లి : ముదినేపల్లి మేజర్ పంచాయ తీలో రెండు గ్రామ సచివాలయాలు ఉన్నప్పటికీ సిబ్బంది అరకొరగానే ఉన్నారు. సచివాలయం –1, సచివాలయం –2 కార్యాలయాలు రెండింటిని పంచాయతీ కార్యాలయంలోనే చాలీచాలని గదు ల్లో నిర్వహిస్తుండడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు సచివాలయాలకు సంబంధించిన 20 మంది ఉద్యోగుల్లో సగం మంది బదిలీలపై వెళ్లిపోగా వారి స్థానాలను భర్తీ చేయలేదు.
ప్రజలకు అందని సేవలు..
ముసునూరు : ముసునూరులో గ్రామ సచివాలయాలు రెండు ఉన్నాయి. సచివా యం–1లో నలుగురు, రెండులో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పేదల కుటుం బాల నిర్ధారణ సర్వేలను గ్రామ సర్వేయర్, ఏఎన్‌ఎం మినహా మిగిలిన ఏడుగురు చేస్తున్నారు. దీంతో సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్యలు, ఇతర పనుల కోసం వచ్చే ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల్లో మంచినీటి సౌకర్యం లేదు.
ప్రతిరోజు ఖాళీగానే ..
జంగారెడ్డిగూడెం,(ఏలూరు) : జంగారెడ్డి గూడెం సచివాలయాలు ప్రతిరోజు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాకుండానే తమ విధులు నిర్వహిస్తున్నారు. సర్వేల పేరుతో సచివాలయంలో ఉండే ఉద్యో గులంతా ఫీల్డ్‌కు వెళ్లిపోతుండడంతో సచివాల యానికి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. సచివాలయాలకు వచ్చే ప్రజలు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చేసేది లేక వెనుతిరుగుతున్నారు. మరోవైపు కార్యాల యాల వద్ద మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడంలేదు. కనీసం సచివాల యాల్లో పరిశుభ్రత పాటించడంలేదు. స్వచ్ఛ భారత్‌ను సచివాలయాల్లో ఏమాత్రం అమలు పరచడం లేదు. పట్టణంలో ఉన్న పది సచివాలయాలలో ఇదే పరిస్థితి. సచివాలయా ల్లో ఉన్న కంప్యూటర్లు ,ప్రింటర్లు పనిచేయక పోవడంతో మూలన పడేశారు.