NIRF Rankings 2025: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో మెరుగ్గా ఆంధ్రా యూనివర్సిటీ
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:43 AM
జాతీయ స్థాయిలో ఆంధ్రా యూనివర్సిటీ మెరుగైన ప్రదర్శన చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకుల్లో పలు విభాగాల్లో 100 లోపు ర్యాంకులు సాధించింది.
రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల విభాగంలో 4వ స్థానం
యూనివర్సిటీల విభాగంలో ఏయూకు 23, ఏఎన్‌యూకు 84వ ర్యాంకు
అభినందనలు తెలిపిన లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఆంధ్రా యూనివర్సిటీ మెరుగైన ప్రదర్శన చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకుల్లో పలు విభాగాల్లో 100 లోపు ర్యాంకులు సాధించింది. ఓవరాల్ విభాగంలో గతేడాది సాధించిన 41 ర్యాంకులోనే ఈ ఏడాది కూడా నిలిచింది. ఇదే విభాగంలో కేఎల్ యూనివర్సిటీ 46 ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల విభాగంలో ఆంధ్రా వర్సిటీ రెండు ర్యాంకులు మెరుగుపరుచుకుని 23వ స్థానంలో నిలిచింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 84 ర్యాంకు సాధించింది. కేఎల్ యూనివర్సిటీ 26, విజ్ఞాన్ 70, గీతం 88 ర్యాంకులు సాధించి టాప్-100లో నిలిచాయి. ఓవరాల్ ర్యాంకింగ్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 101- 150 కేటగిరీలో నిలిచింది. ఎస్‌వీయూ 151-200 కేటగిరీలో ఉంది. ఇక ఫార్మా విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ 31వ ర్యాంకు, ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో 88వ ర్యాంకు సాధించింది. లా కాలేజీల విభాగంలో విశాఖలోని అంబేడ్కర్ న్యాయ కళాశాలకు 16వ ర్యాంకు దక్కింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన ఏయూ, ఇతర వర్సిటీలకు రాష్ట్ర మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యా సంస్థలు మెరుగైన ర్యాంకులు సాధించాయని ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో తెలిపింది.