Share News

Investment Scam: కాంబోడియా.. వయా ఢిల్లీ... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:13 AM

నకిలీ యాప్స్‌తో కాంబోడియా నుంచి వల వేశారు. ఢిల్లీ కేంద్రంగా ఫేక్‌ అకౌంట్లు నిర్వహిస్తూ అనంతపురం జిల్లాకు చెందిన టెకీ నుంచి విడతల వారీగా రూ.1.73 కోట్లు కాజేశారు.

Investment Scam: కాంబోడియా.. వయా ఢిల్లీ... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

  • తక్కువ పెట్టిబడితో ఎక్కువ లాభాల ఆశ

  • విడతలవారీగా రూ.1.73 కోట్లు దోపిడీ

అనంతపురం క్రైం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): నకిలీ యాప్స్‌తో కాంబోడియా నుంచి వల వేశారు. ఢిల్లీ కేంద్రంగా ఫేక్‌ అకౌంట్లు నిర్వహిస్తూ అనంతపురం జిల్లాకు చెందిన టెకీ నుంచి విడతల వారీగా రూ.1.73 కోట్లు కాజేశారు. భాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు నెలరోజులపాటు శ్రమించి.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో గాలించి.. ఐదుగురు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను అరెస్టుచేశారు. ఆ వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నరసింహప్ప.. ఫేస్‌బుక్‌లో కనిపించిన ఇన్వెస్ట్‌మెంట్‌ యాడ్‌కు ఆకర్షితుడయ్యారు. దానిపై క్లిక్‌ చేయగానే కాంబోడియా నుంచి నడుస్తున్న వాట్సప్‌ గ్రూప్‌లో చేరిపోయాడు. ఈ గ్రూప్‌ వేదికగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. నమ్మిన టెకీ ‘వీఐపీ66 బజాజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’, ‘కె26జిరోడహా మార్కెట్‌ ఇన్‌సైట్స్‌’ వంటి ఫేక్‌ యాప్స్‌ను ఫాలో అవుతూ తొలుత రూ.12లక్షల పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజుల్లోనే రూ.5.50లక్షల లాభం వచ్చిందని చెప్పిన సైబర్‌ నేరగాళ్లు.. విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. భారీగా ఆదాయం వస్తుండడంతో నరసింహప్ప ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వరకూ విడతల వారీగా రూ.1,73,99,333 జమ చేశారు. పెట్టుబడి, లాభం కలిపి రూ.3.40 కోట్లు అయిందని, ఆ మొత్తం విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌, బ్రోకరేజీ కింద 40 శాతం డబ్బులు చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. దీంతో టెకీకి అనుమానం వచ్చి జూన్‌ 18న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ జగదీష్‌ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఢిల్లీ, పుణె, సూరత్‌, మధ్యప్రదేశ్‌, పట్నా, బిహార్‌, ఒడిసా, బెంగళూరు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో నెల రోజులపాటు వేట కొనసాగించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో 13 ఫేక్‌ అకౌంట్లు సృష్టించి బాధితుడి నుంచి సొమ్ము లాగేసినట్లు గుర్తించారు.


సైబర్‌ నేరగాళ్ల కోసం అన్వేషణ మొదలెట్టిన పోలీసులు ఫేక్‌ ఖాతాల కూపీ లాగారు. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌ వడ్లమూడి ఫణికుమార్‌ ద్వారా తెరిచిన ఫేక్‌ బ్యాంకు ఖాతాలను కొంగతి కృష్ణ ద్వారా కోదండరామ దుర్గసాయి ప్రసాద్‌ సేకరించాడు. వాటిని ఢిల్లీలోని శ్యాంజీ, ధర్మేంద్ర సింగ్‌కు పంపాడు. వీరు ఢిల్లీ కేంద్రంగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యాక్సిస్‌ ద్వారా ఫేక్‌ అకౌంట్లలోకి డబ్బు లావాదేవీలు చేశారు. ఆ డబ్బును క్రిస్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధపడినట్లు గుర్తించారు. వెస్ట్‌ ఢిల్లీ తిలక్‌ నగర్‌కు చెందిన భావనేష్‌ గోయల్‌ అలియాస్‌ శ్యామ్‌జీ (48), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్‌(43), హైదరాబాద్‌ ఐడీఏ జీడిమెట్లకు చెందిన కోదండరామ దుర్గాసాయి ప్రసాద్‌(32), ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడుకు చెందిన కొంగతి కృష్ణ(43), వడ్లమూడి ఫణికుమార్‌(39)ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.41.20 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లు, ఒక కారు, 20 ఏటీఎం కార్డులు, 15 సిమ్‌కార్డులు, 5 బ్యాంకు పాస్‌పుస్తకాలు, 10 చెక్‌ బుక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ జగదీష్‌ ప్రకటించారు.

Updated Date - Aug 02 , 2025 | 05:15 AM