Share News

SKOCH Awards: మూడు విభాగాల్లో రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డులు

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:50 AM

మెరుగైన పనితీరు కనబరిచినందుకు మూడు విభాగాల్లో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు లభించాయి. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు సోషల్‌ జస్టిస్‌...

SKOCH Awards: మూడు విభాగాల్లో రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డులు

  • పోటీ పరీక్షల్లో బీసీ యువతకు ఉచిత శిక్షణకు అవార్డు అందుకున్న మంత్రి సవిత

  • డిజిటల్‌ టికెట్ల జారీ ప్రక్రియకు ఆర్టీసీకి.. పేదరిక నిర్మూలనలో విశిష్ట సేవలకు మెప్మాకు పురస్కారాలు

న్యూఢిల్లీ/అమరావతి/విజయవాడ (బస్‌స్టేషన్‌), సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): మెరుగైన పనితీరు కనబరిచినందుకు మూడు విభాగాల్లో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు లభించాయి. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు సోషల్‌ జస్టిస్‌ సెక్యూరిటీ విభాగంలో ఏపీ బీసీ సంక్షేమ శాఖకు బంగారు స్కోచ్‌ అవార్డు వరించింది. శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్‌.సవిత పాల్గొన్నారు. స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌, ప్రొఫెసర్‌ మహేందర్‌ దేవ్‌ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 1,674 మందికి, ఆన్‌లైన్‌ ద్వారా మరో 4,774 మందికి ఉచిత శిక్షణ అందజేశామని వెల్లడించారు. వీరిలో 246 మంది మెగా డీఎస్సీలో టీచర్లుగా ఎంపికయ్యారన్నారు. రాబోయే కాలంలో బీసీ యువతకు అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందివ్వనున్నామని ప్రకటించారు. అమరావతిలో ఐదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్‌ నిర్మించనున్నామని, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన ఉందని సవిత తెలిపారు. కాగా డిజిటల్‌ టికెట్లు జారీ ప్రక్రియను విజయవంతంగా అమలుపరచడం ద్వారా ఆర్టీసీ ‘స్కోచ్‌’ అవార్డును గెలుచుకుంది. సంస్థ వైస్‌చైర్మన్‌, ఎండీ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ (ఐటీ) వై.శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు. సంస్థకు అవార్డు రావడం పట్ల ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) జి.వి.రవి వర్మ అభినందనలు తెలియజేశారు. ఇక పేదరిక నిర్మూలనలో విశిష్ట సేవలకు ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు స్కోచ్‌ ప్లాటినం అవార్డు ప్రదానం చేసింది. మిషన్‌ డైరక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ ఈ అవార్డును స్వీకరించారు. మెప్మా సంస్థ పట్టణ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వినూత్న పథకాలకు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మెప్మా కృషికి గుర్తింపుగా 9 అవార్డులను స్కోచ్‌ సంస్థ ప్రదానం చేసింది.


రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖకు ఉత్తమ అవార్డు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు ‘మేరా రేషమ్‌- మేరా అభిమాన్‌’ పేరుతో చేపట్టిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించినందుకు రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖకు ఉత్తమ అవార్డు లభించింది. అవార్డును శనివారం బెంగుళూరులో కేంద్ర జౌళి శాఖ సంయుక్త కార్యదర్శి పద్మినీ సింగ్లా, సభ్య కార్యదర్శి శివకుమార్‌, కేంద్ర పట్టు మండలి సభ్యుడు.. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల డైరెక్టర్‌ శ్రీనివాసులు అందుకున్నారు. ‘మేరా రేషమ్‌- మేరా అభిమాన్‌’ కార్యక్రమం ద్వారా ఏపీలో పట్టు పురుగుల ఉత్పత్తిని పెంచడానికి, కొత్త రైతులతో మల్బరీ సాగుకు అవకాశం ఏర్పడిందని శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఈ ఏడాది రెండోసారి ఉత్తమ అవార్డు పొందింది.

Updated Date - Sep 21 , 2025 | 04:51 AM