Water Conservation: రాష్ట్రానికి జల్‌శక్తి అవార్డులు
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:37 AM
నీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు పలు విభాగాల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అవార్డులు దక్కాయి.
అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోని రెండు గ్రామాలకు జాతీయ జలపురస్కారం
నెల్లూరుకు ‘జలసంచయ్...’ అవార్డు
18న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
న్యూఢిల్లీ/అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు పలు విభాగాల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 6వ జాతీయ జలపురస్కారాలు, ప్రథమ జల్ సంచయ్-జన్ భాగీదారీ అవార్డులను ప్రకటించింది. అత్యుత్తమ గ్రామ పంచాయతీ క్యాటగిరిలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని దుబ్బిగానిపల్లె, కేరళలోని పాయం (కన్నూర్ జిల్లా)తో కలిసి సంయుక్త ప్రథమ విజేతగా నిలిచింది. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలంలోని మురుగుమ్మి గ్రామం, మధ్యప్రదేశ్‌లోని కవేశ్వర్ (ఖాండ్వా జిల్లా) గ్రామంతో కలిసి ద్వితీయ విజేతగా నిలిచింది. జల రంగంలో అత్యుత్తమ కృషి చేసిన సంబంధించి వ్యక్తిగత క్యాటగిరీలో సౌత్ జోన్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖరరాజు ప్రథమ విజేతగా నిలిచారు.
వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యానికి..
నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం, వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యమిచ్చినందుకు ‘జల సంచయ్ జన్ భాగీదారీ-2025’ కింద ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులు దక్కించుకుంది. ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్’ ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తనదైన ముద్ర వేసింది. దక్షిణ జోన్‌లో క్యాటగిరీ-3 కింద నెల్లూరు జిల్లా అవార్డు సాధించింది. నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద డ్వామా అధికారులు ఆ జిల్లాలో 2024లో 856 ఫారం పాండ్స్, 3,495 ఇంకుడు గుంతలు, 112 ఊట చెరువులు, 166 చెక్‌డ్యాంలు, 512 వాటర్ హార్వెస్టింగ్ ఫాండ్స్, 247 చెరువుల పూడికతీత పనులు చేపట్టారు. ఈ క్యాటగిరీ కింద లభించిన అవార్డుకు రూ.25 లక్షల నగదు పురస్కారం అందిస్తారు. అలాగే, ‘టాప్-10 మున్సిపల్ కార్పొరేషన్ల’ జాబితాలో 13,298 పనులు పూర్తి చేసిన రాజమహేంద్రవరం అవార్డు దక్కించుకుంది. ఇందుకు మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.2 కోట్లు నగదు పురస్కారం అందించనున్నారు. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.