Share News

National Energy Conservation Award: ఇంధన సంరక్షణలో ఏపీ టాప్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 05:09 AM

ఎనర్జీ ఎఫిషియన్సీ రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ఏడాది జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును సాధించింది.

National Energy Conservation Award: ఇంధన సంరక్షణలో ఏపీ టాప్‌

  • వరుసగా 4వసారి జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం

  • నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం

  • ఏపీ తరఫున అందుకోనున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎనర్జీ ఎఫిషియన్సీ రంగంలో ఏపీ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ఏడాది జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును సాధించింది. ఈ అవార్డు ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్య రంగాల్లో స్థిరంగా ముందుకు సాగుతున్న ఏపీ పురోగతిని ప్రతిబింబిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పేర్కొన్నారు. ‘అన్ని ప్రధాన రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యకలాపాల్లో పురోగతి కనబరిచాం. జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు -2025లో గ్రూప్‌ -11 విభాగంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోగలిగాలిగాం. విద్యుత్తు రంగంలో సాధిస్తున్న పురోగతి, విద్యుత్తు ఆదాలో రాష్ట్రం సాధించిన విజయాల్లో సీఎం చంద్రబాబు దూరదృష్టి, విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సహకారం ఎంతో ముఖ్యమైనవి’ అని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో నాగలక్ష్మి, ఆమె బృందాన్ని విజయానంద్‌ అభినందించారు. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు రాష్ట్రం తరపున ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఎల్‌. శివశంకర్‌ అందుకోనున్నారు.

ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తాం: నాగలక్ష్మి

జాతీయ అవార్డుపై స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో నాగలక్ష్మి స్పందిస్తూ... ఇంధన సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో పెంచేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. ఏపీ 89.25 పాయింట్లతో గ్రూప్‌-2లో అగ్రస్థానంలో ఉందని, గతేడాది కన్నా 2.3 శాతం ఎక్కువని ఆమె చెప్పారు.

Updated Date - Dec 14 , 2025 | 05:10 AM