AP Fruit Production: పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:50 AM
పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో ఉద్యాన తోటలు
2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి
సూక్ష్మ సేద్యం, రాయితీ పథకాల అమలు ఫలితం
21.05 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణకు 15వ స్థానం
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2024-25లో 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 71.70 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండిస్తుండగా, 11.87 కోట్ల టన్నులు పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2024-25లో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తిపై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో ఉద్యాన పంటల సాగులో రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. పండ్ల ఉత్పత్తిలో మాత్రం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 8.07 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉండగా.. 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 1.81 లక్షల హెక్టార్లలో సాగు, 21.05 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తితో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. అయితే సాగులో 8.96 లక్షల హెక్టార్ల అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర ఉత్పత్తిలో మాత్రం 1.68 కోట్ల టన్నులతో రెండో స్థానం దక్కించుకుంది. 5.89 లక్షల హెక్టార్లలో సాగు, 1.47 కోట్ల టన్నుల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. పండ్ల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ (1.02 కోట్ల టన్నులు), గుజరాత్ (93.47 లక్షల టన్నులు), తమిళనాడు (78.32 లక్షల టన్నులు), కర్ణాటక (53.26 లక్షల టన్నులు), బిహార్ (46.56 లక్షల టన్నులు), పశ్చిమబెంగాల్ (42.89 లక్షల టన్నులు), కేరళ (41.17లక్షల టన్నులు), ఒడిశా (30.28 లక్షల టన్నులు), అసోం (27 లక్షల టన్నులు), జమ్ము కశ్మీర్ (26.92 లక్షల టన్నులు), పంజాబ్ (26.17 లక్షల టన్నులు), తెలంగాణ (21.05 లక్షల టన్నులు), ఛత్తీస్‌గఢ్ (20.60 లక్షల టన్నులు), జార్ఘండ్ (13.59 లక్షల టన్నులు), రాజస్థాన్ (12.68 లక్షల టన్నులు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, పండ్ల ఉత్పత్తి 10 లక్షల టన్నులలోపే ఉంది.
దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉద్యాన తోటలు ఉండగా, 18 రాష్ట్రాల్లోనే లక్ష హెక్టార్లపైన సాగవుతున్నాయి. ఈ రాష్ట్రాలే 10 లక్షల టన్నులపైన దిగుబడి సాధించాయి. కాగా 2024-25లో ఏపీలో అరటి 1.11 లక్షల హెక్టార్లలో 67.34 లక్షల టన్నులు, మామిడి 3.99 లక్షల హెక్టార్లలో 49.86 లక్షల టన్నులు, బత్తాయి 1.13 లక్షల హెక్టార్లలో 23.73 లక్షల టన్నులు, బొప్పాయి 15 వేల హెక్టార్లలో 12.62 లక్షల టన్నులు, నిమ్మ 45 వేల హెక్టార్లలో 9.08 లక్షల టన్నులు, పుచ్చకాయలు 18 వేల హెక్టార్లలో 8.77 లక్షల టన్నులు, జామ 31 వేల హెక్టార్లలో 5.01 లక్షల టన్నులు, దానిమ్మ 15 వేల హెక్టార్లలో 3.86 లక్షల టన్నులు, సపోట 14 వేల హెక్టార్లలో 2.80 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సూక్ష్మసేద్యం అత్యధిక శాతం విస్తరించడంతో పండ్ల ఉత్పత్తి గతం కంటే పెరిగిందని ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఉద్యాన రైతులకు కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా రాయితీలు ఇస్తుండటంతో రాయలసీమలో పండ్ల తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు.