Share News

AP State Investment Growth: 3.65 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:48 AM

భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందురోజే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

AP State Investment Growth: 3.65 లక్షల కోట్లు

  • విశాఖ సదస్సుకు ముందురోజే పెట్టుబడుల ఒప్పందాలు: సీఎం

  • వీటితో 1.26 లక్షల ఉద్యోగాలకు చాన్సు

  • 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు

  • విశాఖ.. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం

  • విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌.. తూర్పుతీర గేట్‌వే! అంచనాలకు మించి పెట్టుబడులు

  • భోగాపురంలో ఏరో సిటీ: సీఎం

  • నీతి ఆయోగ్‌ సీఈవోతో కలిసి రీజియన్‌ డాక్యుమెంట్‌ విడుదల

భారతదేశం 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 160 గిగావాట్లు ఏపీలోనే ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రం త్వరలోనే గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా మారుతుంది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న డేటా సెంటర్లకు గ్రీన్‌ ఎనర్జీనే సరఫరా చేస్తాం.

ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుచేస్తూ రైల్వే, విమానాశ్రయాలతో రవాణా నెట్‌వర్క్‌ అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ని ప్రధాన నగరాలకు రాష్ట్ర పోర్టులను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

- సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందురోజే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీటితో 1.26 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామని తెలిపారు. గురువారం నోవాటెల్‌ హోటల్‌లో నీతిఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌.సుబ్రహ్మణ్యంతో కలిసి విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు అదే హోటల్‌లో ఇండియా-యూరప్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరస్పర సహకారంపై చర్చించారు. అనంతరం ఆయా దేశాల ప్రతినిధులతో ముచ్చటించారు. పోర్టు అతిథిగృహం ఆవరణలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో తూర్పు తీరానికి విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ గేట్‌వేగా పనిచేస్తుందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాలతో ఏర్పాటుచేస్తున్న విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ భవిష్యత్‌ ఆర్థికశక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ‘ఈ రీజియన్‌ పరిధిలోని విశాఖ జిల్లాలో గూగుల్‌ డేటా సెంటర్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో వస్తోంది.


అనకాపల్లి జిల్లాలో రూ.లక్ష కోట్లతో ఆర్సెలార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకాబోతోంది. గత పాలకులు రాష్ట్రాన్ని, విశాఖను సర్వనాశనం చేశారు. ఇప్పుడు అంచనాలకు మించి విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌తోపాటు గిగావాట్‌ సామర్థ్యంలో మరో పెద్ద సంస్థ విశాఖలో డేటా సెంటర్‌ నెలకొల్పబోతోంది. వాటికి అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు వస్తుండడంతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. విశాఖను గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గమ్యస్థానంగా, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఎకనామిక్‌ రీజియన్‌ అథారిటీ చైర్మన్‌ హోదాలో అభివృద్ధి, ఇతర కార్యకలాపాలను నేనే స్వయంగా పర్యవేక్షిస్తా’ అని ప్రకటించారు. విశాఖను మోస్ట్‌ లివబుల్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక విజన్‌ తయారుచేసుకుని అమలుచేస్తున్నామని.. ప్రధాని మోదీ సహకరిస్తున్నారని తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయం విమానాశ్రయం చెంతనే ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణానికి హబ్‌గా మారుస్తామన్నారు. స్కిల్‌ విశాఖ పేరుతో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.


పెట్టుబడులకు ఏపీ అనుకూలం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద 45 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఏపీ గేట్‌వేగా ఉపయోగపడుతుంది. అరకు కాఫీ ఇప్పుడు గ్లోబల్‌ బ్రాండ్‌గా మారింది. మా రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలం. ప్రాధాన్య రంగాలకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో తొలి క్వాంటమ్‌ వ్యాలీని అమరావతిలో నెలకొల్పుతున్నాం. రాష్ట్రాన్ని డ్రోన్ల తయారీ కేంద్రంగా మారుస్తున్నాం. స్పేస్‌ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉంటుంది. అందులో ఏపీ ముందుంటుంది’ అని చెప్పారు. ఇండియా-యూరప్‌ రౌండ్‌ టేబుల్‌ భేటీలో ఆర్మీనియా ఆర్థిక మంత్రి గివార్డ్‌ పొపాయాన్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల ప్రతినిధులు, భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ చైర్మన్‌ అమిత్‌ కల్యాణి, వివిధ కంపెనీల చైర్మన్లు, సీఈవోలు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇటాలియన్‌ క్లస్టర్‌!

ఇటలీ రాయబారితో సీఎం చర్చ

ఇటాలియన్‌ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని ముఖ్యమంత్రి కోరారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇక్కడ ఇటాలియన్‌ పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటుచేసే అంశంపై చర్చించారు. విశాఖలో వివిధ దేశాల రాయబారులతో సీఎం భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో గురువారం భారత్‌లోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. కీలక రంగాలైన ఆటోమోటివ్‌, ఆటో విడి భాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్‌, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చలు జరిపారు. వ్యవసాయ యంత్రాలు, నౌకా నిర్మాణ రంగాల్లో భాగస్వాములు కావాలని ఆ కంపెనీలను సీఎం ఆహ్వానించారు.


  • కుప్పంలో ఇండో-తైవాన్‌ పార్కు

  • రూ.400 కోట్లతో ఏర్పాటుకు అలీజియన్స్‌ గ్రూపు సంసిద్ధత

  • అక్కడే పాదరక్షల తయారీ కంపెనీ

  • ఓర్వకల్లులో సెన్సార్లు, సెమీ కండక్టర్లు,అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమలు

  • సీఎం సమక్షంలో పలు ఒప్పందాలు

విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇండో-తైవాన్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ను కుప్పంలో ఏర్పాటుచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్‌ ప్రతినిధి బృందం వెల్లడించింది. రూ.400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేసేందుకు అలీజియన్స్‌ గ్రూపు సిద్ధమని సీఎం చంద్రబాబుకు తెలియజేసింది. పాదరక్షల తయారీ కంపెనీ పౌ చెన్‌ గ్రూపు సైతం కుప్పంలో ఫుట్‌వేర్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు సంసిద్ధత తెలిపింది. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్‌లో తైపీ ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ప్రతినిధి, రాయబారి ముమిన్‌ చెన్‌ నేతృత్వంలోని తైవాన్‌ ప్రతినిధి బృందం గురువారం విశాఖలో చంద్రబాబును కలిసింది. తైవాన్‌ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎలక్ర్టానిక్స్‌, సెమీ కండక్టర్లు, గ్రీన్‌ ఎనర్జీ, ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తయారీ, తదితర రంగాల్లో తమతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. కాగా.. ఓర్వకల్లులో ఇమేజ్‌ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్‌కు చెందిన క్రియేటివ్‌ సెన్సార్‌ ఇంక్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీకండక్టర్‌ మిషన్‌ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు సహకరించాలని సీఎంను కోరింది. ఓర్వకల్లు సమీపంలోనే ఇ జౌల్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌ సంస్థ అడ్వాన్డ్స్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 2.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీ, కాథోడ్‌ యాక్టివ్‌ మెటీరియల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతిపాదించింది. వీటికి సంబంధించి సీఎం సమక్షంలో తైవాన్‌ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) ఒప్పందాలు చేసుకున్నాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు రీజియన్లను కలుపుతూ పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని చంద్రబాబు తెలిపారు. తైవాన్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను కూడా రాష్ట్రంలో ఏర్పాటుచేయాలని కోరారు. పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్రప్రభుత్వ సహకారం బాగుందని ఆ దేశ బృందం కొనియాడింది.

Updated Date - Nov 14 , 2025 | 05:52 AM