Share News

High Speed Rail: హై స్పీడ్‌... ఏపీ!

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:24 AM

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా...

High Speed Rail: హై స్పీడ్‌... ఏపీ!

  • రాష్ట్రానికి 2 ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లు

  • వ్యయం 5.42 లక్షల కోట్లు.. వేగం 350 కి.మీ.

చీఅమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా వెళ్లే విధంగా రెండు హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. ఎస్సీఆర్‌ ప్రతిపాదనల మేరకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను 605 కిలోమీటర్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ను 760 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. రెండు కలిపి 1,365 కిలోమీటర్ల పొడవు గల హై స్పీడ్‌ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు కారిడార్లు 767 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు ఎస్సీఆర్‌ రూ.5.42 లక్షల కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు రూ.3.04 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు సంబంధించి ఏపీలో 263 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. 6 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు సంబంధించి ఏపీలో 9 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 504 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రెండు కారిడార్లలో ముఖ్యమైన వర్కులు ఏపీలోనే జరగనున్నాయి.


హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌..

హైదరాబాద్‌-బెంగళూరు హై స్పీడ్‌ కారిడార్‌ రాష్ట్రంలో నాలుగు జిల్లాల మీదుగా ఏర్పాటు కానుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా కారిడార్‌ నిర్మాణం జరగనుంది. కర్నూలులో 46.56 కి.మీ. మేర ఏర్పాటు కానున్న కారిడార్‌కు 139.68 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. నంద్యాలలో 37.3 కి.మీ. మేర నిర్మించనున్న కారిడార్‌కు 111.9 హెక్టార్ల సాధారణ భూమితో పాటు 1.29 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి ఉంది. అనంతపురంలో అత్యధికంగా 86.6 కి.మీ పొడవున కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు 259.8 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 79.08 కి.మీ. పొడవున ఏర్పాటు కానున్న కారిడార్‌కు రూ.237.24 హెక్టార్ట భూమితో పాటు 2.92 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ మేరకు భూ కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక లేఖను కూడా సమర్పించింది.

హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌..

చీహైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ ఏపీలో ఏడు జిల్లాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా కారిడార్‌ నిర్మాణం జరగనుంది. పల్నాడు జిల్లాలో 81 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణానికి 243 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో 66.45 కి.మీ. మేర నిర్మాణానికి 199.35 హెక్టార్ల భూమి, బాపట్ల జిల్లాలో 43.21 కి.మీ. నిర్మాణానికి 129.63 హెక్టార్ల భూమి, ప్రకాశం జిల్లాలో 58.37 కి.మీ. నిర్మాణానికి 175.11 హెక్టార్ల భూమి, నెల్లూరు జిల్లాలో 116.79 కి.మీ. నిర్మాణానికి 350.37 హెక్టార్ల భూమి, తిరుపతి జిల్లాలో 130.58 కి.మీ నిర్మాణానికి రూ.391.74 హెక్టార్ల భూమి, చిత్తూరు జిల్లాలో 8.17 కి.మీ. నిర్మాణానికి 24.51 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. వీటితో పాటు పల్నాడులో 21.39 హెక్టార్ల అటవీ భూమి, నెల్లూరులో 40.8 హెక్టార్లు, తిరుపతిలో 20.44 హెక్టార్లు, చిత్తూరులో 7.68 హెక్టార్ల అటవీ భూమి కూడా కారిడార్ల కోసం కేటాయించాల్సిన అవసరం ఉందని ఎస్సీఆర్‌ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాజఽధాని అమరావతిని ఈ కారిడార్‌కు కలిపేలా లైన్‌ ఏర్పాటు అంశం కూడా పరిశీలనలో ఉంది.


ఏపీలో 15 స్టేషన్లు

రెండు హై స్పీడ్‌ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఏపీలో 15 స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు సంబంధించి కర్నూలు, డోన్‌, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం వద్ద ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు సంబంధించి దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఏపీకి ఈ రెండు రైల్వే కారిడార్లు ఎంతో ప్రయోజనం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులను అత్యంత వేగంగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. టైమ్‌ లైన్‌కు అనుగుణంగా లొకేషన్లలో సర్వేలు పూర్తి చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పూర్తిస్థాయిలో అందించాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 05:24 AM