Yoga Promotion Council: రాష్ట్రంలో యోగా ప్రచార పరిషత్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:35 AM
రాష్ట్రంలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం తర్వాత సీఎం చంద్రబాబు ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా...
ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆయుష్
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం తర్వాత సీఎం చంద్రబాబు ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా యోగా ప్రచార పరిషత్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ పరిషత్ ఏర్పాటుకు సన్నద్ధమయ్యింది. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో పరిషత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిషత్ ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి కేంద్రాలుగా ప్రచార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ పరిషత్ చైర్మన్‌గా ఆరోగ్యశాఖ మంత్రి వ్యవహరిస్తారు. ఇందులో పలువురు నిష్ణాతులను సభ్యులుగా నియమించాలని నిర్ణయించారు. యోగా, ప్రకృతి వైద్యం, ప్రజారోగ్య రంగాలకు చెందిన నిపుణులతో విడిగా ప్యానళ్ల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లోని యోగాధ్యయన పరిషత్‌ను ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం - 2014లోని పదో షెడ్యూల్‌లో చేర్చారు. పర్యవసానంగా, భౌగోళికంగా హైదరాబాద్‌లో ఉన్న 4 యూనిట్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లాయి. మన రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యం, పరిశోధనల్ని ప్రోత్సహించే యూనిట్లు లేవు. దీంతో రాష్ట్రంలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిషత్ ఏర్పాటు, విధి విధానాలను ఆయుష్ శాఖ సిద్ధం చేసింది. కమిటీలు ఏర్పాటు, వాటి పరిధికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేసింది. వార్షిక వ్యయం కింద రూ.5 కోట్ల వరకూ ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. సుమారు 70 మంది సిబ్బంది, నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిషత్‌ను సొసైటీని రిజిస్ట్రేషన్ చట్టం కింద ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల కేంద్ర ఆయుష్ శాఖ నుంచి అదనంగా గ్రాంట్లు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యం ప్రాధాన్యతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పరిషత్ కార్యకలాపాలు నిర్వహించనుంది.