Share News

AP CM Chandrababu: రెండేళ్లలో ఏపీ బ్రాండ్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:48 AM

రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

AP CM Chandrababu: రెండేళ్లలో ఏపీ బ్రాండ్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌

  • క్వాంటమ్‌ వ్యాలీగా రాష్ట్రం

  • టెక్నాలజీ అంటే నాకెంతో ఇష్టం

  • సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో

  • నాతో పోటీ పడే సీఎం దేశంలో లేరు

  • ఈ మాట ఎస్‌ఎం కృష్ణ కూడా చెప్పేవారు

  • ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం

  • క్వాంటమ్‌ వ్యాలీతో ఏపీకి పేరొస్తుంది

  • సెమీ కండక్టర్స్‌లోకీ అడుగుపెడుతున్నాం

  • పదేళ్లలో ప్రపంచం ఎంతో మారుతుంది

  • జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో సీఎం

  • విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆరేడు దేశాలు మాత్రమే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ, సమాచార శాఖ విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సోమవారం ప్రారంభించిన రెండు రోజుల 28వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘సివిల్‌ సర్వీసె్‌స-డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రసంగించారు. భారతదేశంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవడంలో తనతో పోటీ పడే ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ఇదే మాట మాజీ సీఎం దివంగత ఎస్‌ఎం కృష్ణ కూడా అనేవారు. ‘‘ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ శాఖల ద్వారా పౌర సేవలు అందించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పార్టీగా తెలుగుదేశం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. తొలుత ఈ-సేవ, ఆ తరువాత మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించాం. ఇప్పుడు మన మిత్ర ద్వారా 751 సేవలు వాట్సాప్‌ ద్వారానేఅందించడానికి ఏర్పాట్లు చేశాం. ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ అంటూ స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తున్నారు. దీనిని అన్ని రంగాలకు విస్తరిస్తాం. పెద్దఎత్తున స్వదేశీ బ్రాండ్లు తయారుచేసి ప్రపంచ దేశాలకు అందించాలని పిలుపునిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం ‘సంజీవని’ పేరుతో ప్రజల డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు తయారు చేస్తోంది. దీన్ని మొదట ఏపీలో అమలు చేసి, ఆపై ఇతర రాష్ట్రాలకూ అందిస్తాం. ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త నినాదం’తో ముందుకు వెళుతున్నాం. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ల ద్వారా ఎంఎ్‌సఎంఈలకు ప్రోత్సాహం ఇస్తాం’’ అని వెల్లడించారు.


సంస్కరణలతో భారీ రాబడి: కేంద్ర మంత్రి

ప్రభుత్వ కార్యాలయాల పనితీరును మార్చడానికి 2022లో ప్రారంభించిన పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) ద్వారా ఇప్పటి వరకు రూ. 33 వేల కోట్ల ఆదాయం (ఎలక్ర్టానిక్స్‌ తుక్కు విక్రయం) వచ్చిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ చెప్పారు. ఆ ఆదాయం మూడు స్పేస్‌ మిషన్ల బడ్జెట్‌కు సమానమన్నారు. జాతీయ ఈ-గవర్నెన్స్‌-2025 సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ-గవర్నెన్స్‌లో ఉత్తమ విధానాలు అనుసరించిన కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి సంస్థలు, గ్రామ పంచాయతీలు, విద్య, పరిశోధన సంస్థలకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. ఆరు విభాగాల్లో 10 స్వర్ణ, 6 రజత పతకాలు, మూడు జ్యూరీ అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ.. ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను తరలించడం వల్ల ఏడు లక్షల చ.మీ. స్థలం వినియోగంలోకి వచ్చింది. రాత్రిపూట పారిశుధ్య పనులు నిర్వహించడానికి అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని చంద్రబాబే ప్రారంభించారు. 25 ఏళ్లుగా విశాఖతో నాకు అనుబంధం ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. భోగాపురం కేవలం అంతర్జాతీయ విమానాశ్రయంగానే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. శ్రీహరికోటలో అదనపు లాంచ్‌ ప్యాడ్‌కు ఏర్పాట్లు చేయడం గర్వకారణం’’అని చెప్పారు. విశాఖ ఐటీ హబ్‌గా మారడానికి వేగంగా అడుగులు పడుతున్నాయని రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌ చెప్పారు. సదస్సులో ఆయన ‘ఐటీ హబ్‌గా విశాఖ’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.


ఏఐ, క్వాంటమ్‌ అద్భుత కాంబినేషన్‌

అమెరికాకు సిలికాన్‌ వ్యాలీలా.. ఏపీకి క్వాంటమ్‌ వ్యాలీ పేరు తెస్తుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను అనుసంధానం చేస్తున్నాం. ఇది అపూర్వమైన కాంబినేషన్‌. రాబోయే పదేళ్లు చాలా కీలకమైన దశ. ఆ తరువాత ప్రపంచమే మారిపోతుంది. త్వరలో సెమీ కండక్టర్‌ రంగంలోకి కూడా ఏపీ అడుగు పెడుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. ఏపీలో ప్రస్తుతం శ్రీహరికోటలో స్పేస్‌ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ, విశాఖలో మెడ్‌టెక్‌ పార్క్‌, విజయవాడలో క్వాంటమ్‌ వ్యాలీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో 5జీ సేవలు అందుతున్నాయి. త్వరలోనే 6జీకి ఆపై 7జీకి కూడా వెళతాం.

Updated Date - Sep 23 , 2025 | 04:49 AM