Share News

AP CM Chandrababu: లాజిస్టిక్స్‌ హబ్‌ ఏపీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:08 AM

లాజిస్టిక్స్‌, రవాణా, పరిశ్రమలు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, టూరిజం రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు.

AP CM Chandrababu:  లాజిస్టిక్స్‌ హబ్‌ ఏపీ

  • టూరిజం, పరిశ్రమలు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లోనూ నం.1 కావాలి: సీఎం

  • రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

  • విశాఖలో జీఎంఆర్‌ ఏవియేషన్‌ వర్సిటీ,లాజిస్టిక్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తాం

  • పారిశ్రామికవేత్తలకు నాడు నరకం

  • ఎమ్మెల్యేలూ..అభివృద్ధికి అడ్డుపడొద్దు

  • అజమాయిషీకి ప్రయత్నిస్తే సహించను

  • అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): లాజిస్టిక్స్‌, రవాణా, పరిశ్రమలు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, టూరిజం రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. తెలుగువారంతా నంబర్‌వన్‌గా ఉండాలని, ప్రపంచంలోనే భారత్‌ ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. లాజిస్టిక్స్‌, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగావకాశాలు తదితర అంశాలపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. లాజిస్టిక్స్‌ అంశంపై సభలో తొలిసారి మాట్లాడుతున్నానని చంద్రబాబు తెలిపారు. ‘‘వస్తురవాణాతోపాటు ప్రయాణికుల రవాణా రంగాలనూ మరింత అభివృద్ధి చేస్తాం. దేశ రవాణా రంగ వ్యయం రూ.24.07 లక్షల కోట్లు. జీడీపీలో లాజిస్టిక్స్‌ వాటా 7.97శాతం. రవాణారంగంలో రహదారి వాటా 41శాతం. లాజిస్టిక్స్‌ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరంఉంది. తూర్పు తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం మనది. అందువల్ల వస్తురవాణా రంగంలో మనమే కీలకం. లాజిస్టిక్స్‌ యాజమాన్య నిర్వహణలో ప్రత్యేక ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తాం. రైల్‌, రోడ్‌, విమాన, జల రవాణాతోపాటు పైప్‌లైన్‌ద్వారా గ్యాస్‌, నీరులాంటివి రవాణా చేయవ చ్చు. మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవ స్థ ద్వారా హయ్యర్‌ కార్గో చేయడంద్వారా రవాణా వ్యయం తగ్గించుకోవచ్చు. డ్రైపోర్టులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. లాజిస్టిక్స్‌లో ఎకో సిస్టమ్‌ తీసుకువస్తాం. దీనికోసం బ్లూ ప్రింట్‌ తయారు చేస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తోంది...

‘‘గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్ఠు పట్టించింది. రాష్ట్రమంతా గుంతలు పడ్డ రోడ్లుతో అప్పట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే గుంతలు పూడ్చి రహదారులను అభివృద్ధి చేశాం. రాష్ట్రంలోని వేర్వే రు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రోడ్లను రూ. 4,500 కోట్లతో త్వరలోనే చేపడతాం. జాతీయ రహదారుల పనులను రూ.లక్షన్నర కోట్లతో తలపెడుతు న్నాం. జాతీయ రహదారుల్లో రాష్ట్రం దేశంలోనే రెం డో స్థానంలో ఉంది. హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధిని మరోస్థాయికి తీసుకెళతాయి. గతంలో హైదరాబాద్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లాలంటే నాలుగు రోజులు పట్టేది. హైదరాబాద్‌-అమరావతి, చెన్నై-బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రయిన్‌ రాబోతోంది. విశాఖ రైల్వే జోన్‌ను సాధించాం. ఇం దుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.’’


లాజిస్టిక్స్‌లో అపార అవకాశాలు..

‘‘జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్లపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. ఈ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ఇవి రాష్ట్ర ప్రాజెక్టులు కావని అశ్రద్ధ చేయొద్దు. కాంట్రాక్టు సంస్థలపై అజమాయిషీకి ప్రయత్నిస్తూ, వాటిని ఇబ్బంది పెట్టవద్దు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఐదు ఆపరేషనల్‌ నాన్‌మేజర్‌ పోర్టులున్నాయి. నాలుగు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులున్నాయి. నౌకాయానం లో దేశంలో రెండోస్థానంలో ఉన్నాం. ఈ విషయంలో గుజరాత్‌ తొలిస్థానంలో ఉంది. ప్రస్తుతం 182 మిలియన్‌టన్నుల కార్గోను మన పోర్టులు చేపడుతున్నాయి. 2.5 లక్షల కోట్ల మేర లాజిస్టిక్‌ రంగంపై వ్యయం చేసేందుకు అవకాశం మనకు ఉంది.’’

డీఎస్సీపై వైసీపీ అక్కసు

‘‘15 నెలల్లోనే అన్ని రంగాల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలుపుకొంటాం. తాజాగా 15,941 ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాం. ఉపాధ్యాయ నియామకాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కి మంచిపేరు వస్తుందన్న ఆక్రోశంతో వైసీపీ 150 కేసులను న్యాయస్థానంలో వేసింది. కానీ, ఒక్క రూ పాయి అవినీతి లేకుండా మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం.’’


పెత్తందారీలా జగన్‌ వ్యవహరించారు

అంతఃరాష్ట్ర నదీజలాల రవాణాకు రాష్ట్రంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాజిస్టిక్‌ కనెక్టివిటీని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటుచేస్తాం. ఏపీ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ నెలకొల్పుతాం. లాజిస్టిక్స్‌లో మనకు నైపుణ్యం తక్కువ. అందువల్లే లాజిస్టిక్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్‌ అంశం లో ప్రతిష్ఠాత్మక మెర్స్‌ అండ్‌ మార్క్స్‌ సంస్థ సహకారం అందిస్తోంది. ఏరో స్పేస్‌, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ, లైఫ్‌సైన్సెస్‌ తదితర రంగాలపై దృష్టి పెట్టాం. గత పాలకులు కియ కార్ల కంపెనీని వేధించారు. పారిశ్రామికవేత్తలతో జగన్‌ పెత్తందారీలా వ్యవహరించారు. అపోలో టైర్స్‌ యాజమాన్యం కంటనీరు పెట్టుకుంది. బెదిరించి మరీ ఎంఓయూలు రద్దు చేశారు.

నిన్న స్టీల్‌ సిటీ..ఇకపై నాలెడ్జ్‌ సిటీ..

‘‘విశాఖ నిన్నటిదాకా స్టీల్‌ సిటీ.. ఇకపై నాలెడ్జ్‌ సిటీ. రూపాయికే ఎకరా భూమి ఇస్తున్నామంటూ వైసీపీ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. టీసీఎ్‌సకు, కాగ్నిజెంట్‌కు భూములిస్తే తప్పేంటి? విశాఖకు గూగుల్‌ వస్తోంది. మిత్తల్‌ స్టీల్స్‌, అల్యూమినియం పరిశ్రమలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో 50వేల హోటల్‌రూమ్‌లు అందుబాటులో ఉండేలా ఆ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. విశాఖలో జీఎంఆర్‌ ఏవియేషన్‌ వర్సిటీ ఏర్పాటు చేయనుంది. భోగాపురం విమానాశ్రయంనుంచి వచ్చేఏడాది ఆగస్టునుంచి సేవలు ప్రారంభమవుతాయి.’’


నిత్య విద్యార్థిని.. సంస్కరణలకు ఆద్యుడిని..

‘‘దసరా అంటే మైసూర్‌, కోల్‌కతా గుర్తుకువస్తాయి. ఇప్పుడు అదే స్థాయిలో విజయవాడ కనక దుర్గ ఉత్సవాలు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం పొందుతున్నాయి. ఎకో టూరిటాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలన్నదే నాలక్ష్యం. రాష్ట్రంలో డేటా లేక్‌ తయారుచేశాం. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 784 ప్రభుత్వసేవలు అందిస్తున్నాం. వచ్చేఏడాది జనవరిలో అమరావతికి క్వాంటం కంప్యూటర్‌ వస్తుంది. అమెరికాలోని జినోమ్‌ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపిస్తాం. క్వాంటం కంప్యూటర్‌లను ఉత్పత్తి చేసే కేంద్రంగా అమరావతి మారనుంది. నేను నిత్య విద్యార్థిని. సంస్కరణలకు ఆద్యుడిని. నా సంస్కరణలకు సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరే సాక్షి. బుచ్చయ్య చౌదరి కూడా నిత్యవిద్యార్థి.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ...చంద్రబాబు సాంకేతిక జ్ఞానాన్ని చూశాక, తాను 40 ఏళ్ల తర్వాత ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నానన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 04:11 AM