Minister Dola: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేద్దాం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:20 AM
ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు....
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో మంత్రి డోలా
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని లయోలా కళాశాల ఆడిటోరియంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరుకాగా, వారినుద్దేశించి మంత్రి స్వామి మాట్లాడారు. చెడు వ్యసనాలకు బానిసైన యువత కోసం జిల్లాకొక డీఅడిక్షన్ కేంద్రం ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపామని, వాటి నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. డ్రోన్‌ల ద్వారా గంజాయి సాగును గుర్తించి తోటలను నాశనం చేశామన్నారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు వ్యసనాల జోలికి పోకుండా, తమ లక్ష్యం మేరకు విద్య, వ్యాపార రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా సభలో ఉన్న విద్యార్థులందరి చేత మాదక ద్రవ్యాలు సేవించబోమని, వాటిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ క్షణికమైన సంతోషం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ఉమారాజ్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్‌రెడ్డి ప్రసంగించారు.