Nara Lokesh: ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:44 AM
రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రిలియన్ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు) పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
విశాఖ పెట్టుబడుల సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు
జీ20 దేశాల ప్రతినిధులు కూడా: లోకేశ్
నేటి ఉదయం 9కి సంచలన పెట్టుబడి ప్రకటన.. ఎక్స్‌లో మంత్రి ఆసక్తికర పోస్ట్
న్యూఢిల్లీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రిలియన్ డాలర్ల (లక్ష కోట్ల డాలర్లు) పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వ పాలనలో గత 16 నెలల్లో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని, అలాగే ఏపీలో నమో (నాయుడు, మోదీ) ప్రభుత్వం ఉందని తెలిపారు. పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకునేందుకు మూడు కారణాలున్నాయని, అందులో మొదటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. రెండోది చంద్రబాబు సమర్థ నాయకత్వం.. మూడోది పరిపాలన అని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్ర, శనివారాల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం నిర్వహించిన కర్టెన్‌రైజర్ ప్రెస్‌మీట్‌లో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ‘భాగస్వామ్య సదస్సు సమయంలో రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తాం. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. క్లస్టర్ల వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయి.
పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వచ్చే మూడేళ్లలో 50 వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చంద్రబాబుకు సీఐఐతో మంచి అనుబంధం ఉంది. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు రానున్నారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్రానికి సంబంధించిన సెషన్లు ఉంటాయి’ అని వివరించారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
‘ఎన్నికల సమయంలో ప్రధానంగా ఆరు హామీలు ఇచ్చాం. మొదటి హామీ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయిమెంట్ మిషన్ ఇది. అందుకే మేం రూపొందించిన ప్రతి పాలసీ కూడా ఉద్యోగాల సృష్టికోసమే. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ. 1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్థి చేస్తోంది. రాష్ట్రం కోసం యువగళం పేరుతో చేసిన పాదయాత్రలో ఎదురైన సంఘటనలు నన్ను తీర్చిదిద్దాయి’ అని లోకేశ్ తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, సానా సతీశ్, తెన్నేటి కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
టిల్మాన్ గ్లోబల్ 15 వేల కోట్ల పెట్టుబడులు
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) ఏపీలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఢిల్లీలో యూఎస్-ఇండియా స్ర్టాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సదస్సులో టిల్మాన్ ఏపీలో పెట్టుబడులపై అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ ప్రకటించారు. వెంటనే లోకేశ్ సమక్షంలో టీజీహెచ్ చైర్మన్-సీఈవో సంజీవ్ అహూజా ఎంవోయూ పత్రాలను ప్రభుత్వ ప్రతినిధులతో పంచుకున్నారు.