Share News

AP GSDP Growth Target: ఈసారి 17.11శాతం వృద్ధి

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:14 AM

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థిలా ఎదురుచూస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో చెప్పారు.

AP GSDP Growth Target: ఈసారి 17.11శాతం వృద్ధి

  • ఫలితాల కోసం విద్యార్థిలా ఎదురుచూస్తా

  • వ్యవసాయ రంగానికి ఎంత చేస్తున్నా చేయాల్సింది ఇంకా ఉంటుంది: సీఎం

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థిలా ఎదురుచూస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో చెప్పారు. ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని.. దీనికి అనుగుణంగా అధికారులు పనిచేసి, లక్ష్యాలు చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి యూనిట్‌, ప్రతి శాఖలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని.. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ప్రగతిలో.. కలెక్టర్లు , ఉన్నతాధికారుల పనితీరులో కచ్చితమైన మెరుగుదల కనిపించాలని స్పష్టంచేశారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా కొన్ని ప్రాంతాలకు చేయూతనిస్తున్నాం. గడచిన 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. మొత్తం 17 విభాగాల్లో మనం ఫలితాలు సాధిస్తేనే జీఎ్‌సడీపీ పెరుగుతుంది. జీఎ్‌సడీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకం. జిల్లా స్థాయిలో పక్కా ప్లాన్లు రూపొందించుకోవాలి. పశుసంపద, ఉత్పాదక రంగం, ఫిషింగ్‌ తదితర రంగాల్లో ప్రగతి సాధించాలి. వ్యవసాయం ఎప్పుడూ డిమాండ్‌ ఆధారంగా ఉండాలి. పశుగ్రాసం పెంపకంలో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయండి. గతంలో తెలంగాణతో పోటాపోటీగా ఉండేవాళ్లం. గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాలతో ఏపీ దక్షిణ భారతంలో చివరిస్థానానికి చేరింది. వృద్ధి సాధించి మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవాలి. 2024 తర్వాత జీఎ్‌సడీపీ కాస్త మెరుగుపడింది. వ్యవసాయంపై బాగా దృష్టి సారించాలి. ఈ రంగానికి ఎంత చేస్తున్నా చేయాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులు పంపేలా చేయగలిగితే వ్యవసాయ రంగం సుస్థిరత సాధిస్తుంది. ఉద్యాన పంటల్లో మనమే నంబర్‌ వన్‌గా ఉన్నాం.


అయినా ఈ రంగంలో కూడా భారీగా రూ.60-70 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు రావలసిన అవసరం ఉంది. వ్యవసాయంలో మూడు సీజన్లు స్వల్పకాలిక, ఐదేళ్ల కాలంతోపాటు మధ్య 10-15 ఏళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికలను తయారుచేసుకోవాలి. డిమాండ్‌ ఉన్న పంటలు, నీటిభద్రత, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అగ్రిటెక్‌ లాంటి 10 సూత్రాలను వ్యవసాయ రంగంలో భాగం చేయాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్వోదయ కింద అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాం. 2047కు ఏపీ అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఏ ఒక్కరు వెనుకబడినా లక్ష్యాలను చేరుకోవడం కష్టతరమవుతుంది. గేట్స్‌ ఫౌండేషన్‌, అగ్రివాచ్‌ లాంటి సంస్థల సేవలను వినియోగించుకుని రైతులకు లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోండి. నాణ్యమైన ఉత్పత్తులను పండించేలా వారికి అవగాహన కల్పించాలి’ అని సీఎం సూచించారు.

విశాఖ ఒప్పందాలపై దృష్టి: మంత్రి లోకేశ్‌

విశాఖ పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వచ్చేలా భూ కేటాయింపులు చేపట్టాలని మంత్రి లోకేశ్‌ కలెక్టర్లను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఐటీ, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ మంత్రులు ఈ ఒప్పందాలు అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 18 , 2025 | 04:15 AM