Andhra Pradesh Supports Aqua Industry: ఆక్వా రంగానికి అండగా నిలుస్తాం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:02 AM
రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం...
ఆక్వా అడ్వయిజరీ కమిటీ సమావేశంలో లోకేశ్
మంగళగిరి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్, వ్యవసాయ, మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో బుధవారం ఆక్వా కల్చర్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆక్వా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ సంస్థలు, హేచరీస్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ‘ఇప్పటికే ఆక్వా ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకాలను విధించింది. మరో 25శాతం సుంకాలు పెంచే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేద్దాం. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందాం. సీఎం కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు’ అని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశీయంగా రొయ్యల వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.