Share News

Housing Scheme: మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:57 AM

రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ...

Housing Scheme: మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు

  • వచ్చే నెలలో 3 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

  • సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు మరో 2 లక్షల ఇళ్లు

  • ఇళ్లు లేని పేదల గుర్తింపునకు 15 రోజుల్లోగా సర్వే

  • పెద్ద కుటుంబాల వారికి ఉమ్మడి గృహాల నిర్మాణం

  • గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించా రు. బుధవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. వీటిలో 3 లక్షల ఇళ్లలో వచ్చేనెలలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని ఆదేశించారు. సంక్రాంతి నాటికి మరో 2లక్షల ఇళ్లు లబ్ధిదారుల కు అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపట్టిన ఇళ్ల ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిర్మాణాల ను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేద కుటుంబాలను గుర్తించేందుకు 15 రోజుల్లోగా సర్వే పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూములను గుర్తించాలన్నారు. పెద్ద కుటుంబాల వారికి ఉమ్మడి ఇళ్లు నిర్మించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం కింద మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు విడుదల చేయాలని సీఎం చెప్పారు. కాగా, పీఎంఏవై(అర్బన్‌), పీఎంఏవై(గ్రామీణ్‌), పీఎం జన్‌మన్‌ పథకాల కింద రాష్ట్రానికి మొత్తం 18,59, 504 ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో ఇప్పటికే 9,51,351 గృహాల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎంకు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 4,647 మంది లబ్ధిదారులకు రూ.16.37 కోట్లు చెల్లించగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,73, 709 మంది లబ్ధిదారులకు రూ.919.29 కోట్ల మేర బిల్లులను త్వరలో చెల్లించనున్నట్లు వివరించారు.

టిడ్కోను నాశనం చేశారు: నారాయణ

గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను సర్వనాశనం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. మొత్తం ఇళ్లకు వైసీపీ రంగులు పులిమేశారని ఆ రంగులు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేయాల్సిన రూ.2,900కోట్లను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.

Updated Date - Aug 21 , 2025 | 04:57 AM