Revenue Court Cases: రెవెన్యూ కోర్టు కేసులు ఆన్‌లైన్ పరిధిలోకి
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:11 AM
రాష్ట్రంలో రెవెన్యూ కోర్టుల్లో ఏయే కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని పరిష్కారానికి నోచుకోలేదు? అన్నది త్వరలో తేలనుంది. వాటి వివరాలను రెవెన్యూ శాఖ ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తోంది.
ఇనాం, ఆర్‌ఓఆర్ వివరాల నమోదు
ఆర్‌సీఎమ్‌ఎస్‌లోకి కేసుల డేటా
ఇప్పటి వరకు 10,142 అప్‌లోడ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో రెవెన్యూ కోర్టుల్లో ఏయే కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని పరిష్కారానికి నోచుకోలేదు? అన్నది త్వరలో తేలనుంది. వాటి వివరాలను రెవెన్యూ శాఖ ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తోంది. ఇనాం డీటీ, ఆర్‌డీఓ, జాయింట్ కలెక్టర్, అప్పీల్స్ కమిషనర్, సెటిల్‌మెంట్ కమిషనర్, ఇంకా రెవెన్యూ స్పెషల్ సీఎస్, రెవెన్యూ మంత్రి వద్ద ఉండే కోర్టుల్లోని డేటా అంతా రెవెన్యూ కోర్టు మేనేజ్‌మెంట్ సిస్టం(ఆర్‌సీఎమ్‌ఎస్)లోకి తెస్తోంది. ఇనాం రద్దు చట్టం-1957 పరిధిలోని క్లెయిమ్‌లు ఇనాం డీటీల వద్ద భారీగా పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లాల వారీగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని కేసులు పరిష్కరించారు? అప్పీళ్ల దశలో ఉన్న కేసులు ఎన్ని? అన్న సమాచారం రెవెన్యూ శాఖ వద్ద స్పష్టంగా లేదు. ఆయా జిల్లాల్లో కూడా సరైన డేటా లేదు. పలుకుబడి ఉన్న, రాజకీయ ఒత్తిళ్లతో ముడిపడిన ఇనాం కేసులే త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి. ఆ కేసుల్లో ఏం తీర్పులు ఇచ్చారో కూడా రికార్డులు అందుబాటులో ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తక చట్టం(రికార్డ్ ఆఫ్ రైట్స్-ఆర్‌ఓఆర్)-1957 కేసులు ఇంతకుముందు జిల్లా స్థాయిలో ఆర్‌డీఓలు చూసేవారు. ఆ తర్వాత ఆ అధికారం డీఆర్‌ఓలకు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ ఆర్‌డీఓలకే అప్పగిస్తూ చట్టసవరణ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇనాం, ఆర్‌ఓఆర్ కేసుల వివరాలన్నీ ఆర్‌సీఎమ్‌ఎ్‌సలోకి అప్‌లోడ్ చేయాలని భూపరిపాలనా ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా భారీగా అసైన్డ్ చట్ట ఉల్లంఘన కేసులున్నాయి. వీటిని తహసీల్దార్, ఆర్‌డీఓ, జేసీలు చూస్తున్నారు. ఎవరి స్థాయిలో ఎన్ని కేసులున్నాయి? వాటి తాజా పరిస్థితి ఆర్‌సీఎమ్‌ఎ్‌సలోకి అప్‌లోడ్ చేయాలని జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 10,142 కేసుల వివరాలను ఇందులో అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. అసైన్డ్ చట్టం పరిధిలోకి వచ్చేవి 523, ఆర్‌ఓఆర్ చట్టానికి సంబంధించినవి 9,489 కేసులను అప్‌లోడ్ చేశారు. ఇందులో కొత్తగా భూ కబ్జాలకు సంబంధించిన కేసుల డేటాను కూడా కలుపుతున్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని భూ వివాదాల కేసులను పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేయించాలని సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేశారు.