NCRB Report: అవినీతి డబుల్
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:17 AM
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు వైసీపీ పాలనలో ఓ పక్క నేతలు భారీగా దోచుకుంటుంటే ఉద్యోగులు కూడా వారి బాటలోనే నడిచారు.....
2023లో 160 కేసులు నమోదు
అతి తక్కువ కేసుల్లోనే శిక్షలు
జాతీయ సగటు కంటే ఏపీలోనే పెండింగ్ కేసులు ఎక్కువ.. వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు వైసీపీ పాలనలో ఓ పక్క నేతలు భారీగా దోచుకుంటుంటే ఉద్యోగులు కూడా వారి బాటలోనే నడిచారు. దీనిని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్‌సీఆర్‌బీ) బహిర్గతం చేసింది. జగన్ జమానాలో ఒక్క ఏడాది కాలంలోనే ఏసీబీ కేసులు రెట్టింపు అయ్యాయి. ఆ లెక్కలు అన్నింటినీ ఎన్‌సీఆర్‌బీ లెక్కలతో సహా బయట పెట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లు కరోనాతో గడిచి పోయింది. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా 80 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి ఏడాదిలో ఏకంగా 160 కేసులతో ఏపీ ఏసీబీ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఏ ఒక్క శాఖకో ఈ అవినీతి కేసులు పరిమితం కాలేదు. రెవెన్యూ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు తాము సేకరించిన సమాచారం ఆధారంగా 2023లో అప్పటి ఏసీబీ డైరెక్టర్ పీహెచ్‌డీ రామకృష్ణ సంచలన కేసులు నమోదు చేశారు. ఏసీబీ ట్రాప్‌ల్లో ఆదాయానికి మించిన ఆస్తులున్న, లంచాలతో ప్రజల్ని పీడించిన ఉద్యోగులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా 110 మంది అవినీతి ఉద్యోగులు నేరుగా లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు. అప్పటి వైసీపీ పెద్దలతో పాటు వారు చెప్పినట్లు ఆడే ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా తగ్గకుండా ఏసీబీ అధికారులు కేసులు పెట్టారు. వందల కోట్లు పోగేసుకున్న 17 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో రోజూ లక్షల్లో కొల్లగొడుతున్న అవినీతి పరులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా వసూలు చేస్తున్న 33 మందిని కటకటాల్లోకి పంపారు. మొత్తం మీద 2023లో 172 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవినీతి కేసుల్లో ఊచలు లెక్కబెట్టారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే ట్రాప్ కేసుల్లో నాలుగో వంతు, అక్రమాస్తుల కేసుల్లో ఐదో వంతు, క్రిమినల్ మిస్ కాండక్ట్ కేసుల్లో ఆరో వంతు ఏపీలోనే ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వివరించింది.
పెండింగ్ కేసులు భారీగా.. శిక్షలు స్వల్పంగా..
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జలగల నుంచి అనకొండల వరకూ ఏసీబీ వలలో చిక్కాయి. అయితే జగన్ పాలనలో ఏసీబీ కోర్టుల్లో యాభై శాతం మంది అవినీతి పరులకే శిక్షలు పడింది. 2023 నాటికి రాష్ట్రంలోని కోర్టుల్లో విచారణకు వచ్చినవి 947 కేసులు కాగా తీర్పు వచ్చింది మాత్రం 41 కేసుల్లోనే. అందులోనూ 20 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. మరోవైపు పాత కేసులన్నీ కలిపి 2023 నాటికి ఏకంగా 1,100 కేసులు వివిధ జిల్లాల్లోని కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే మన రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల శాతం చాలా ఎక్కువ. 95.5 కేసులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అవినీతి కేసుల్లో శిక్షలు పడక పోయినా.. సుదీర్ఘంగా విచారణ సాగినా అవినీతి కట్టడి కష్టమేనని నిజాయితీగా పనిచేసే అధికారులు అభిప్రాయపడుతున్నారు.