Nala Act Repeal: ఇకపై భూ అభివృద్ధి ఫీజు
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:04 AM
వ్యవసాయ భూమిని సాగేతర అవసరాలకు మళ్లించినందుకు వసూలు చేసే నాలా ఫీజు ఇకపై ఉండదు. దానిస్థానంలో భూ వినియోగ మార్పిడి చేసినందుకు అభివృద్ధి (డెవల్‌పమెంట్ చార్జీ) ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూ వినియోగ మార్పిడిపై 4శాతం వసూలు
నాలా ఫీజుకు స్వస్తి.. చట్టం రద్దుపై ఆర్డినెన్స్
మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం
నేడు క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం
నిషేధ జాబితాలోని ప్రైవేట్ భూములకు విముక్తి
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూమిని సాగేతర అవసరాలకు మళ్లించినందుకు వసూలు చేసే నాలా ఫీజు ఇకపై ఉండదు. దానిస్థానంలో భూ వినియోగ మార్పిడి చేసినందుకు అభివృద్ధి (డెవల్‌పమెంట్ చార్జీ) ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (సాగేతర అవసరాలకు మళ్లించడం-ల్యాండ్ కన్వర్షన్-నాలా) చట్టం-2006ను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, ఏకాభిప్రాయం కుదిరితే ఆమోదించనున్నారు. తర్వాత గవర్నర్ ఆమోదం తీసుకొని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇప్పటివరకూ నాలా చట్టం ప్రకారం భూ వినియోగ మార్పిడికి ప్రాంతాన్ని బట్టి భూమి విలువ ఆధారంగా 1-2 శాతం మేర ఫీజు వసూలు చేసేవారు. ఈ చట్టం రద్దయిన తర్వాత భూ వినియోగ మార్పిడి కోరేవారు ప్రభుత్వానికి అభివృద్ధి ఫీజు (డెవల్‌పమెంట్ చార్జీ) చెల్లించాలి. ఈ ఫీజు ఎంతో ఆర్డినెన్స్‌లో పొందుపరచలేదు. భూమి విలువలో డెల్‌పమెంట్ చార్జీ కనీసం 4శాతం ఉండాలని మంగళవారం సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక మంత్రి పి. నారాయణ, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, న్యాయశాఖ మంత్రి ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు. నాలా రద్దు ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చాక ఇచ్చే నిబంధనల్లో(రూల్స్) డెవల్‌పమెంట్ చార్జీ 4శాతం ఉండాలన్న అంశాన్ని పొందుపరచనున్నారని సమాచారం. ఇది రిజిస్ట్రేషన్ ఫీజుతో సమానంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
భూముల ఇంటిగ్రేషన్‌కు ఆమోదం
భూములు, వాటి రికార్డులు రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ పరిధిలో ఉన్నాయి. నాలా చట్టం రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చూసేందుకు వీటిని ప్రత్యేకంగా ఇంట్రిగేషన్ చేయాలన్న ప్రతిపాదనకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ భూములను వెబ్‌ల్యాండ్‌లో ఏకీకరణం చేసి సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. వెబ్‌ల్యాండ్‌లో సాగు భూములు, ప్రభుత్వ భూములు, సాగేతర అవసరాలకు మళ్లించిన భూములకు ప్రత్యేక ఖాతా నంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు.
22(ఏ)నుంచి ప్రైవేటు భూముల తొలగింపు
మంత్రివర్గ ఉపసంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వంలో రాజకీయ, ఇతర కారణాలతో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భూములను కూడా నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని గతేడాదే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అంశంపైనా ఉపసంఘం పరిశీలన చేసింది. రైతులు, విద్యాసంస్థలు, కాలేజీలు, ఇతర వ్యవస్థల ప్రైవేట్ భూములను గతంలో అసైన్డ్ భూములగా చూపించి, నిషేధ జాబితాలో చేర్చినట్లు గుర్తించారు. ఇలాంటి భూములను వెంటనే 22(ఏ) నుంచి తొలగించాలని, వెబ్‌ల్యాండ్ రికార్డుల్లోనూ అవి ప్రైవేట్ భూములుగానే నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఉపసంఘం ఆదేశించినట్లు సమాచారం.
సమయం పడుతుంది: మంత్రి అనగాని
నాలా రద్దు ముసాయిదా ఆర్డినెన్స్‌ను బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశానికి సమర్పిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని మీడియాకు తెలిపారు. అసైన్డ్ ఫ్రీహోల్డ్ భూములపై పూర్తిస్థాయిలో చర్చించి పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. అక్టోబరు నాటికి నిర్ణయం తీసుకోవాలని తొలుత భావించినా, ఇందులోని అనేక సంక్లిష్టతలకు పరిష్కారం చూపడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. వచ్చే ఉపసంఘం భేటీలో ఇనాం, ఎస్టేట్ భూములపై చర్చిస్తామన్నారు.
రాత్రికి రాత్రే పరిష్కారం కాదు: మంత్రి పయ్యావుల
ఫ్రీహోల్డ్‌లో అనేక అక్రమాలు, ఉల్లంఘనలు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిపై సమాలోచనలు జరుపుతున్నామని మంత్రి పయ్యావుల చెప్పారు. ‘ఇది రాత్రికి రాత్రే పరిష్కరించే అంశం కాదు. వందల, వేల సంవత్సరాలుగా ఉన్న వివాదాలను చూడాలి’’ అని స్పష్టం చేశారు.