Share News

AP District Reorganization: కొత్త కొత్తగా..

ABN , Publish Date - Dec 31 , 2025 | 03:58 AM

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, ఆదోని-2 మండలంలో బుధవారం నుంచే పరిపాలన ప్రారంభమవుతోంది.

AP District Reorganization: కొత్త కొత్తగా..

  • నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌

  • పునర్వ్యవస్థీకరణ ఖరారు-తుది నోటిఫికేషన్ల జారీ

  • కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం

  • మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా

  • నూతనంగా ఐదు రెవె న్యూ డివిజన్లు

  • కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ‘ఉమ్మడి’ అధికారులే ఇన్‌చార్జులు

  • రంప, చింతూరు డివిజన్లు పోలవరంలోకి

  • అల్లూరిలో 11 మండలాలు, ఒక డివిజన్‌

  • కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్‌

  • తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు

  • రాయచోటి డివిజన్‌లో 6 మండలాలే

  • మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరిలోకి

  • సామర్లకోట.. పెద్దాపురం డివిజన్‌లోకి

పోలవరం జిల్లా..

ఇందులో రెండు రెవెన్యూ డివిజన్లు (చింతూరు, రంపచోడవరం), 14 మండలాలను చేర్చారు. ఇంతవరకు ఈ డివిజన్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేవి. కొత్తజిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉంటుంది. రంప డివిజన్‌లో 8 మండలాలు, చింతూరు డివిజన్‌లో నాలుగు మండలాలున్నాయి. కొత్త జిల్లాలో రంపచోడవరంఅసెంబ్లీ స్థానం ఒక్కటే ఉండడం గమనార్హం. అలాగే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌, 11 మండలాలు మిగిలాయి.

మార్కాపురం జిల్లా..

ఇందులో రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలు ఉన్నాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో 15 మండలాలున్నాయి. కనిగిరి డివిజన్‌లో ఆరు మండలాలున్నాయి. ఇంతకు ముందు కనిగిరి డి విజన్‌లో ఉన్న పొదిలి, కొనకనమిట్ల మండలాలను మార్కాపురం డివిజన్‌లో చేర్చారు. కొత్త జిల్లా హెడ్‌క్వార్టర్‌ మార్కాపురమే.

అన్నమయ్య జిల్లాలో సంపూర్ణ మార్పులు

జిల్లాకు మదనపల్లె ప్రధాన కేంద్రం. రాయచోటి రెవెన్యూ డివిజన్‌గా కొనసాగనుంది. జిల్లాలో 25 మండలాలున్నాయి. మదనపల్లె, రాయచోటి డివిజన్లు ఉండగా.. కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు, చౌడేపల్లి మండలాలను మదనపల్లె డివిజన్లో, సదుం, సోమల మండలాలను పీలేరు డివిజన్‌లోకి తీసుకొచ్చారు.


అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, ఆదోని-2 మండలంలో బుధవారం నుంచే పరిపాలన ప్రారంభమవుతోంది. ఈ మేరకు మంగళవారం తుది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాలు (ఏర్పాటు) చట్టం-1974 ప్రకారం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కలెక్టర్లను, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్‌చార్జులుగా కొనసాగుతారని తెలిసింది. జనవరి 1 నుంచి ఓటర్ల సర్వే జరుగనుంది. కాబట్టి జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులూ చేయడానికి వీల్లేదు. దీంతో బుధవారం నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లలో పాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


28 జిల్లాలు, 81 డివిజన్లు..

జిల్లాలు, డివిజన్ల భౌగోళిక పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం జిల్లాలు 28కి, రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. కొత్తగా ఆదోని-2 మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరింది. నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిస్థాయిలో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాయచోటి స్థానంలో మదనపల్లెను జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు.

తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కడపలో చేర్చారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు.

ఐదు రెవెన్యూ డివిజన్లు..

కొత్తగా అద్దంకి (ప్రకాశం జిల్లా), మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా), బనగానపల్లె (నంద్యాల జిల్లా), పీలేరు (అన్నమయ్య), అడ్డరోడ్‌ జంక్షన్‌ (అనకాపల్లి జిల్లా) రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 81కి చేరింది.

రెండుగా ఆదోని మండలం..

కర్నూలుజిల్లాలో 46 గ్రామాలతో అతిపెద్ద మండలంగాఉన్న ఆదోనిని రెండుగా విభజించారు. ఆదోని-1మండలంలో 24 పంచాయతీలు ఉంటాయి. మండల కేంద్రంగా ఆదోనే ఉంటుంది. ఆదోని-2 మండలంలో 22పంచాయతీలున్నాయి. దీనికీ ఆదోనే మండలకేంద్రం. గతంలో ఈ మండలాన్ని పెద్దహరివాణంగా ఏర్పాటుచేయాలనుకున్నారు. ప్రజాస్పందన వ్యతిరేకంగా ఉండడంతో ఆదోని మండల కేంద్రంగా రెండో మండలం ఏర్పాటుచేశారు.


జిల్లాల్లో మార్పుచేర్పులు ఇవీ..

  • అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణతో రాజంపేట డివిజన్‌ కడప జిల్లాలోకి వచ్చింది. కడప జిల్లాలో ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలున్నాయి. బద్వేలు డివిజన్‌లో 9, కడప డివిజన్‌ 9, జమ్మలమడుగు డివిజన్‌ 10, పులివెందుల 8, రాజంపేటలో 4 మండలాలున్నాయి.

  • చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్‌లో ఉన్న బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లోకి మార్చారు.

  • నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లె డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సంజమల, కొలిమిగుండ్ల, బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల మండలాలున్నాయి. ఇవి ఇంతకుముందు డోన్‌ డివిజన్‌లో ఉండేవి. ఇప్పుడు డోన్‌ డివిజన్‌లో డోన్‌, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలే మిగిలాయి. కేవలం మూడు మండలాలతో ఉన్న ఏకైక రె వెన్యూ డివిజన్‌ కూడా ఇదే.

  • శ్రీసత్యసాయి జిల్లాలో ఇంతకు ముందు పెనుకొండలో ఉన్న మండలాలను విభజించి కొత్తగా మడకశిర డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు మండలాలు.. మడకశిర, గుదిబండ, రోళ్ల, అమరాపురం, అగలి ఉన్నాయి.

  • పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలున్నాయి. ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్‌లో ఉన్న రైల్వేకోడూరు, పెంగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలోకి తీసుకొచ్చారు. ఈ మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. వీటి విలీనంతో తిరుపతి డివిజన్‌ 14 మండలాలకు చేరింది. గూడూరు డివిజన్‌లో ఉన్న వాకాడు, చిట్టమూరు మండలాలను సూళ్లూరుపేట డివిజన్‌లో కలిపారు.


  • నెల్లూరు జిల్లాలో పునర్విభజన తర్వాత 4 రెవెన్యూ డివిజన్లు (కావలి, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు), 36 మండలాలున్నాయి. ఇంతకు ముందు తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను తిరిగి నెల్లూరులోకి తెచ్చారు. కందుకూరు డివిజన్‌లో ఉన్న కొండాపురం, వరికుంటపాడు మండలాలను కావలి డివిజన్‌లోకి మార్చారు.

  • ప్రకాశం జిల్లాలో పునర్విభజన తర్వాత కందుకూరు, ఒంగోలు, అద్దంకి డివిజన్లు 28 మండలాలున్నాయి. ఇందులో అద్దంకి డివిజన్‌ను బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చారు.

  • బాపట్ల జిల్లాలో ఇప్పుడు బాపట్ల, చీరాల, రేపల్లె డివిజన్లు, 20 మండలాలున్నాయి.

  • పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ మండలానికి వాసవీ పెనుగొండగా పేరు మార్చారు.

  • మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమజిల్లా నుంచి తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లాలో, రాజమహేంద్రి డివిజన్‌లో కలిపారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు రెండు డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి.

  • కాకినాడ డివిజన్‌లో ఉన్న సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్‌లో కలిపారు.

  • అనకాపల్లి జిల్లాలో కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఖరారు చేశారు. ఇందులో ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాలున్నాయి. డివిజన్‌ కేంద్రంగా అడ్డరోడ్డు జంక్షన్‌ ఉంటుంది. దీంతో ఈ జిల్లాలో ఇప్పుడు 3 డివిజన్లు, 24 మండలాలున్నాయి.

Updated Date - Dec 31 , 2025 | 04:00 AM