Animal Husbandry Department: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:27 AM
రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఉపాధితో పశుసంవర్ధక రంగం అభివృద్ధిలో గణనీయపాత్ర పోషిస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ దామోదర్‌నాయుడు చెప్పారు.
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఉపాధితో పశుసంవర్ధక రంగం అభివృద్ధిలో గణనీయపాత్ర పోషిస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ దామోదర్‌నాయుడు చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 12.17 శాతం వాటాతో రూ. 1.61 లక్షల కోట్లు పశుగణ రంగం నుంచి లభిస్తోందన్నారు. శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని చెప్పారు. గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, మాంస ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానం, గేదెల ఉత్పత్తిలో 6వ స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ జీరో కావడం వల్ల పౌల్ర్టీ రంగం ఊపందుకుంటుందని అన్నారు. పశు సంవర్ధక రంగంలో 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పెట్టుకుంటుందని పేర్కొన్నారు. దానిలో భాగంగా 50 శాతం రాయితీపై పశుదాణా, 75 శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలు, 85 శాతం రాయితీతో పశు బీమా, 70-90 శాతం రాయితీపై గోకులాల నిర్మాణం, 100 శాతం రాయితీతో బహువార్షిక పశుగ్రాసాల సాగు చేపడుతున్నట్లు చెప్పారు. పౌల్ర్టీ అసోసియేషన్ అధ్యక్షుడు సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు మీడియా భేటీలో పాల్గొన్నారు.