Equal Justice Report: ఉమెన్ జస్టిస్‌లో ఏపీ 9వ స్థానం
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:16 AM
దేశవ్యాప్తంగా అత్యధిక శాతం మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ (16.67 శాతం) 9వ స్థానంలో ఉంది.
హైకోర్టులో 30 మంది జడ్జీలలో ఐదుగురు మహిళలు
జాబితాలో తెలంగాణ టాప్..30 మందిలో 10 మంది వారే
లా అండ్ పాలసీ రిసెర్చ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అత్యధిక శాతం మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ (16.67 శాతం) 9వ స్థానంలో ఉంది. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం మొత్తం 30 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ఐదుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ (33.3 శాతం) అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రిసెర్చ్ అనే సంస్థ ‘ఈక్వల్ జస్టిస్’ పేరుతో దేశవ్యాప్తంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య, ప్రాతినిధ్యం, వారి శాతం తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం... సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా.. వారిలో మహిళా న్యాయమూర్తులు కేవలం ఇద్దరే (6.06శాతం). సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ 279 మంది న్యాయమూర్తులుగా పనిచేయగా.. వారిలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 11 (3.94 శాతం) మాత్రమే. 51 మంది భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయగా..వారిలో ఒక్కరు కూడా మహిళలు లేరు.
జస్టిస్ రమణ హయాంలో ముగ్గురు
సుప్రీంకోర్టు చరిత్రలో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 11 కాగా.. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్‌వీ రమణ హయాంలోనే నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది నియమితులయ్యారు. ఈ ముగ్గురితో ఒకేరోజు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ తొలిసారిగా సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1937లో జస్టిస్ అన్నా చాందీ దేశంలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 1991లో జస్టిస్ లీలా ేసథ్ హైకోర్టుకు మొదటి మహిళా చీఫ్ జస్టిస్ అయ్యారు.
2027లో సీజేఐగా జస్టిస్ నాగరత్న
దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ సుప్రీం కోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఈ అరుదైన గౌరవం జస్టిస్ బీవీ నాగరత్నకు దక్కనుంది. 2027లో సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె పదవీకాలం 36 రోజులే అయినప్పటికీ.. మొదటి మహిళా సీజేఐగా చరిత్రలో నిలవనున్నారు.
హైకోర్టుల్లో 14.42శాతం మాత్రమే
దేశంలో ఎనిమిది హైకోర్టుల్లో ఒక్కొక్కరు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నా రు. సిక్కిం, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, బిహార్ హైకోర్టుల్లో ఒక్కరు చొప్పున బాధ్యతల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా 763 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉండగా.. వారిలో 110 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అంటే.. హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల శాతం 14.42 మాత్రమే.