Share News

AP Water Resources Dept: బనకచర్లపై ముందుకే

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:58 AM

తెలంగాణ, కర్ణాటక వ్యతిరేకిస్తున్నా.. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై ముందుకే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ భావిస్తోంది. ప్రాజెక్టు చేపట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని...

AP Water Resources Dept: బనకచర్లపై ముందుకే

  • డీపీఆర్‌ తయారీకి ఏపీ సంసిద్ధత

  • టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, కర్ణాటక వ్యతిరేకిస్తున్నా.. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై ముందుకే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ భావిస్తోంది. ప్రాజెక్టు చేపట్టడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని నిర్ణయించిన రాష్ట్ర జలవనరుల శాఖ.. ఇందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీకి సంకల్పించింది. గోదావరి జలాలను బనకచర్ల గుండా రాయలసీమకు తరలించేందుకు రూ.81వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్‌)ను జలశక్తి శాఖకు, జల సంఘానికి సమర్పించడం.. దానిపై సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం కోరడం.. వరద జలాల అందుబాటుపై రాష్ట్రప్రభుత్వాన్ని జలసంఘం కొన్ని వివరణలు అడగడం.. తగు అనుమతులతో మళ్లీ తమ వద్దకు రావాలని సూచించడం తెలిసిందే. తెలంగాణ, కర్ణాటకల కొర్రీలు, ఇంత భారీ వ్యయంతో ప్రాజెక్టు చేపట్టేకన్నా.. రూ.10 వేల కోట్లు ఖర్చుచేస్తే రాయలసీమలో కీలక ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని సాగునీటి నిపుణులు, రైతు సంఘా ల నాయకుల సలహాల నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం నుంచి కదలిక లేదు. ఇప్పుడు డీపీఆర్‌ తయారీని తెరపైకి తెచ్చింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం సమగ్ర నివేదిక తయారీకి ఆసక్తి చూపే సంస్థల కోసం గుంటూరు జిల్లా జల వనరుల శాఖ ఈ నెల 5న టెండర్లు పిలిచింది. ఈ పథకానికి సంబంధించి పీఎ్‌ఫఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని.. అందుచేత డీపీఆర్‌ను సిద్ధం చేయాలని కోరింది. ప్రత్యేకించి తొలి దశలో పోలవరం నుంచి నల్లమల సాగర్‌ వరకు విడిగా సమగ్ర నివేదికను కోరనుంది.

Updated Date - Oct 09 , 2025 | 04:58 AM