Godavari Pushkaram: గోదావరి పుష్కరాలకు 3 వేల కోట్లు.!
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:54 AM
పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికలు వేస్తోంది....
ఏడాదిన్నర ముందుగానే ఏర్పాట్లకు సన్నాహాలు
ఆరు జిల్లాల్లో 500కు పైగా స్నాన ఘాట్లు
పది కోట్ల మందికి పైగా వస్తారని అంచనా
అందుబాటులో 5 వేల బస్సులు.. 2,800 రైళ్లు ఉంచాలని నిర్ణయం
కార్యదర్శుల కమిటీతో సీఎస్ తొలి సమీక్ష
అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికలు వేస్తోంది. ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 500 పైగా ఘాట్‌లు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. 2015 పుష్కరాల్లో 485 స్నాన ఘాట్‌లను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి పునర్నిర్మించాల్సి ఉంది. ఈసారి మొత్తం పుష్కరాల నిర్వహణకు దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015లో సుమారు రూ. 1,400 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో కేంద్రం కొంత మేర సహాయం అందించింది. ఈసారి కేంద్రం నుంచి మెజార్టీ వాటా రప్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక 2015లో 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా, 2027 పుష్కరాలకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పాత ఘాట్లు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ముందుగా ఘాట్ల నిర్మాణ పనుల టెండర్లకు సిద్ధమవుతోంది. అలానే పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానికి తగ్గట్లు ఏర్పాట్లకు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ఆయా ఆలయాల్లో మరమ్మతులతో పాటు భక్తుల సౌకర్యార్థం కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. పిండ ప్రదానాలకు ప్రత్యేక ఘాట్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది. పురోహితులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
రవాణా సౌకర్యాలపైనా కసరత్తు
పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 5 వేల బస్సులు, దాదాపు 2,800 రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని సీఎస్ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 12 తేదీ వరకూ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలపై ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన సమావేశమైంది. సీఎస్ మాట్లాడుతూ, ‘‘ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం, కార్యదర్శుల బృందంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండియన్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇప్పటి నుంచే ఆయా శాఖలు, జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్లు కమిటీలను ఏర్పాటు చేసుకుని పనులను పర్యవేక్షణ చేయాలి. ఘాట్లను గుర్తించడం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య శిబిరాలు, భద్రత, జనసమూహా నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై వివరణాత్మక డీపీఆర్‌లను కలెక్టర్లు సిద్ధం చేసి పంపాలి’’ అని ఆదేశించారు. గోదావరి నది అల్లూరి జిల్లా గుండాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ మొదటి స్నానఘాట్ ఉంటుందని దేవదాయ శాఖ సెక్రటరీ హరిజవహల్‌లాల్ తెలిపారు.