West Godavari District: ఏపీ నిట్‌కు నీరేది
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:27 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తి అయ్యింది.
10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికీ హామీ అమలు కాని వైనం
తాడేపల్లిగూడెం అర్బన్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తి అయ్యింది. రోజూ 10 లక్షల లీటర్ల మంచినీరు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. భూగర్భ జలాలపైనే ఏపీ నిట్ విద్యార్థులు ఆధారపడుతున్నారు. గతంలో మంచి నీరు కొనుగోలు చేసే దుస్థితి నెలకొనడంతో.. రోజూ లక్ష లీటర్ల నీటిని మున్సిపాలిటీ నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వ హామీ మేరకు మంచి నీరు సరఫరా చేయాలంటే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో ప్లాంట్ నిర్మాణం కోసం సుమారు రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసారు. అప్పట్లోనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించినా సుమారు రూ.3 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టడంతో నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వం బిల్లు మంజూరు చేస్తేనే నిర్మాణం ముందుకు సాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల కాంట్రాక్టర్‌తో సంప్రదింపులు జరిపారు. బిల్లు మంజూరు చేస్తేనే పనులు ప్రారంభిస్తానని ఆయన స్పష్టంచేశారు. ఫలితంగా నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. అది పూర్తయితే అదనంగా రోజూ కోటి లీటర్ల మంచినీటిని శుద్ధ్ది చేసి పట్టణ ప్రజలకు అందజేసే అవకాశం ఉంటుంది. అందులో నుంచి 10 లక్షల లీటర్ల నీటిని ఏపీ నిట్‌కు ఇవ్వాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.