Share News

CPI Ramakrishna: దేశంలోనే అతిపెద్ద స్కాం... ఏపీ లిక్కర్‌ స్కాం

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:18 AM

దేశంలోనే అతి పెద్ద స్కాం ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కాం. ఢిల్లీ లిక్కర్‌ స్కాం దీంతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఈ స్కాంలో స్వాహా చేసిన రూ.3,500 కోట్లను...

CPI Ramakrishna: దేశంలోనే అతిపెద్ద స్కాం... ఏపీ లిక్కర్‌ స్కాం

  • స్వాహా సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి: సీపీఐ రామకృష్ణ

కడప మారుతీనగర్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘దేశంలోనే అతి పెద్ద స్కాం ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కాం. ఢిల్లీ లిక్కర్‌ స్కాం దీంతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఈ స్కాంలో స్వాహా చేసిన రూ.3,500 కోట్లను నిందితుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యంతో వేల మంది కిడ్నీలు, లివర్‌లు దెబ్బతిన్నాయని, మధ్యవయస్కులు వారే ఎక్కువగా ఇందులో బాధితులుగా ఉన్నారని తేలిందన్నారు. లిక్కర్‌ స్కాంలో స్వాహా చేసిన డబ్బును స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని, ఈ స్కాంలో ఎవరున్నా అందరినీ అరెస్టు చేయాలని సూచించారు. విద్యుత్‌ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ చార్జీలను పెంచి ప్రజలపై దాదాపు రూ.15,480 కోట్ల భారం మోపడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని ప్రజలను, రైతులను రెచ్చగొట్టిన చంద్రబాబు, లోకేశ్‌ ఇవాళ అదే స్మార్ట్‌ మీటర్లను బిగించాడానికి ఆమోదం తెలపడం సరైంది కాదన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్‌ చార్జీలతో పాటు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రాయలసీమలోని తాగు, సాగు నీటి ప్రాజెక్ట్‌లు గత కొన్ని దశాబ్దాలుగా పూర్తి కాక పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఆ విషయాన్ని గాలికొదిలేసి పోలవరం-బనకచర్ల అంటూ కొత్త పల్లవిని చంద్రబాబు అందుకోవడం సరైంది కాదన్నారు. సీమ ప్రాజెక్ట్‌లపై ప్రైవేటు వారికి పెత్తనం అంటగడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 06:19 AM