Central Minister Shobha Karandlaje: ఏపీలో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:47 AM
ఏపీలో 2020-21 నుంచి 2024-25 వరకు 16,053 సూక్ష్మ పరిశ్రమలు స్థాపితమైనట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లాజే తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏపీలో 2020-21 నుంచి 2024-25 వరకు 16,053 సూక్ష్మ పరిశ్రమలు స్థాపితమైనట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లాజే తెలిపారు. మంగళవారం, రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీశ్ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.614 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల చేసినట్లు వివరించారు. అంతేకాకుండా సూక్ష్మపరిశ్రమల ద్వారా సుమారు 1.28 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలిపారు.
16 వేల సూక్ష్మ పరిశ్రమలు
దేశవ్యాప్తంగా మొత్తం 4,597 పారిశ్రామిక పార్కులు ఉండగా, అందులో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. మంగళవారం, లోక్‌సభలో ఎంపీలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 638 పారిశ్రామిక పార్కులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (527)రెండో స్థానంలో, రాజస్థాన్(460) మూడో స్థానంలో ఉన్నాయన్నారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ (వరంగల్) సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుల ఏర్పాటు జరుగుతోందని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.