AP Agriculture Growth: అగ్రిలో రాష్ట్రం అగ్రపథం
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:26 AM
వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది. 2025-26 రెండో త్రైమాసికంలో జాతీయ స్థాయి వృద్ధికంటే అత్యధిక శాతం సాధించింది.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారీ వృద్ధి
జాతీయ స్థాయిలో 1.8.. రాష్ట్రంలో 10.70శాతం
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది. 2025-26 రెండో త్రైమాసికంలో జాతీయ స్థాయి వృద్ధికంటే అత్యధిక శాతం సాధించింది. ప్రస్తుతం జాతీయ వృద్ధి 1.8 శాతం ఉండగా, ఏపీలో 10.70 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో ప్రస్తుత ధరల వద్ద స్థూల విలువ జోడింపు(జీవీఏ) జాతీయ స్థాయిలో రూ.10,55,598 కోట్లు ఉండగా, రాష్ట్రంలో రూ.1,25,577 కోట్లుగా నమోదైంది. గత మూడేళ్లలో రెండో త్రైమాసికం(జూలై నుంచి సెప్టెంబరు)లో వ్యవసాయ రంగ జీవీఏను పరిశీలిస్తే.. 2023-24లో రూ.99,262 కోట్లు, 24-25లో 1,13,441 కోట్లు ఉండగా,25-26లో రూ.1,25,577 కోట్లకు చేరింది. ఆక్వాలో 26.27శాతం వృద్ధి రేటు నమోదవగా, వ్యవసాయంలో 11.43శాతం, ఉద్యాన రంగంలో 4.35 శాతం, పశుసంవర్ధకంలో 4.18శాతం, అటవీ, కలప ఉత్పత్తుల్లో 5.59శాతం వృద్ధి నమోదైంది. అయితే, రెండో త్రైమాసికంలో వరి ఉత్పత్తి 24శాతం పెరిగి, 2.93 లక్షల టన్నుల నుంచి 3.64 లక్షల టన్నులకు చేరింది. పత్తి ఉత్పత్తి 31శాతం వృద్ధి చెందింది. అరటి ఉత్పత్తిలో 151శాతం వృద్ధి సాధించింది. మత్స్య రంగం మరింత వృద్ధి చెందింది. రొయ్యల ఉత్పత్తి 5.47 లక్షల టన్నుల నుంచి 6.95 లక్షల టన్నులకు(27శాతం) పెరిగింది. మాంస ఉత్పత్తి 8శాతం, కోడి గుడ్ల ఉత్పత్తి 6.7శాతం పెరిగాయి. 2025-26లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 16.47శాతంతో జీవీఏ రూ.6,02,278 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు తొలి 6 నెలల్లో జీవీఏ రూ.2.07,073 కోట్లు(34.36శాతం) మాత్రమే సాధించింది. దీంతో అక్టోబరు నుంచి మార్చి వరకు మిగతా జీవీఏ రూ.3,95,655 కోట్లు(65.64శాతం) సాధించాలని ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది.