Share News

Self Certification Scheme: రియల్‌కు నూతనోత్తేజం

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:45 AM

భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. ఈ విధానాన్ని సమూలంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ధ్రువీకరణ పథకాన్ని (సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం)ను తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి సవరించిన...

Self Certification Scheme: రియల్‌కు నూతనోత్తేజం

  • భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధ్రువీకరణ పథకం

  • నూతన మార్గదర్శకాలు జారీ చేసిన పట్టణాభివృద్ధి శాఖ

  • నిర్మాణ కార్యకలాపాలు సులభతరం,వేగవంతానికి దోహదం

  • అనుమతులు రాగానే భవన నిర్మాణం ప్రారంభించే అవకాశం

  • స్వీయ ధ్రువీకరణ పొందితే టౌన్‌ప్లానింగ్‌ తనిఖీలు ఉండవు

  • ఆమోదించిన ప్లాన్‌కు కట్టుబడాల్సిన బాధ్యత యజమానిదే

  • తప్పుడు సమాచారం ఇస్తే ఎల్‌టీపీల లైసెన్స్‌ ఐదేళ్లు రద్దు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. ఈ విధానాన్ని సమూలంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ధ్రువీకరణ పథకాన్ని (సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం)ను తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ పథకం దోహదపడనుంది.అభివృద్ధిలో భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించడం రియల్‌ ఎస్టేట్‌ రంగంతో పాటు నిర్మాణ రంగానికి ప్రయోజనకంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా సవరణల ద్వారా భవన నిర్మాణ వాతావారణాన్ని సురక్షితంగా,సమ్మిళితంగా, పర్యావరణపరంగా స్థిరంగా మార్చడంతో పాటు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలున్నాయి. త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ పొందిన సాంకేతిక సిబ్బందిని జవాబుదారీగా చేశారు. ప్రజలకు నమ్మకం కలిగించే రీతిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆన్‌లైన్‌లో చార్జీల చెల్లింపుల తర్వాత దరఖాస్తులను పరిశీలించి తక్షణమే భవన నిర్మాణ అనుమతి పత్రాలు జారీ చేయడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహణ వేగవంతం కానుంది. ఈ విధానంలో అనుమతి పొందిన వెంటనే దరఖాస్తుదారులకు వెంటనే భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవడానికి అధికారం లభిస్తుంది. భవన నిర్మాణ ప్రణాళిక దరఖాస్తులు, ఇతర ముఖ్యమైన పత్రాలు, తనఖా వివరాలు ఆన్‌లైన్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ సిస్టం(ఓబీఎం)లో లైసెన్స్‌ పొందిన సాంకేతిక నిపుణుల (ఎల్‌టీపీ) ద్వారా సమర్పించాలి.


దరఖాస్తుదారు, ఎల్‌టీపీ ఇద్దరూ సంతకం చేసిన స్వీయ ధ్రువీకరణ ప్రొఫార్మాను సమర్పించడం ఈ ప్రక్రియలో అదనపు అంశం. ఇలా సమర్పించిన సమాచారం పత్రాల ప్రామాణికతను, కచ్చితత్వాన్ని ధ్రువీకరిస్తుంది. స్వీయ ధ్రువీకరణ పొందిన భవనాలకు టౌన్‌ప్లానింగ్‌ అధికారుల తనిఖీలు ఉండవు. మొత్తం దస్త్రాల్లో 10 నుంచి 15శాతం వరకు తనిఖీల కోసం ఎంపిక చేస్తారు. ఇది ప్రజలు, డెవలపర్లపై నిర్వహణ భారాన్ని తగ్గించనుంది.

ఈ ప్రాజెక్టులకు వర్తింపు

స్వీయ ధ్రువీకరణ పథకం-2025 కొన్ని రకాల నిర్మాణ ప్రాజెక్టులకు వర్తిస్తుంది. 4వేల చ.మీ. విస్తీర్ణంలో ఉన్న నాన్‌ హైరైజ్‌ నివాస భవన ప్రణాళిక అనుమతులకు ఇది వర్తిస్తుంది. ఇందులో ఆమోదించిన లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌-2008, ఎల్‌ఆర్‌ఎస్‌-2020 కింద క్రమబద్ధీకరించిన లేఅవుట్లు, విలేజ్‌ సైట్లు, గ్రామకంఠాలు, ఆమోదించిన సర్క్యులేషన్‌ ప్యాట్రన్లు ఉన్న ప్రాంతాలు, రాజధాని నగరం మినహా సీఆర్‌డీఏ పరిధిలోని 300 చ.మీ. లేదా అంతకంటే పెద్ద ప్లాట్లు, గతంలో ఆమోదించిన ప్రణాళికలతో ఉన్న లేదా 1985కి ముందు ఉన్న భవనాలను మళ్లీ అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం 500 చ.మీ. లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగిన వైట్‌ కేటగిరీ పరిశ్రమల స్థాపనకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు, పట్టణాభివృద్ధి అథారిటీల పరిధిలోని గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి.


యజమానిదే ప్రాథమిక బాధ్యత

నిర్మాణ ప్రక్రియ మొత్తం ఆమోదించిన ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా చూడాల్సిన బాధ్యత భవన యజమానిదే. అదేవిధంగా ఎల్‌టీపీల పాత్ర కూడా కీలకం. దరఖాస్తులో తప్పుడు సమాచారం లేకుండా, అన్ని ప్లాన్‌లు మాస్టర్‌ప్లాన్‌, జోనింగ్‌ నిబంధనలు, ఏపీ భవన నిర్మాణ నిబంధనలు 2017కు అనుగుణంగా ఉన్నాయని వారు నిర్ధారించుకోవాలి. ప్లింత్‌ బీమ్‌ పూర్తిచేసిన ఏడు రోజుల్లోపు ప్లింత్‌ లెవల్‌ తనిఖీ నివేదికను సమర్పించాలి. సైట్‌ సెట్‌బాక్‌ నిర్వహణను ధ్రువీకరించాలి. నిర్ణీత గడువులోగా ఈ నివేదికను అప్‌లోడ్‌ చేయడంలో విఫలమైతే తనిఖీ పూర్తయిందని, నిర్మాణం ఆమోదించిన ప్లాన్‌ ప్రకారమే ఉందని ఎల్‌టీపీ ధ్రువీకరించినట్లుగా పరిగణిస్తారు.ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే ఎల్‌టీపీలు బాధ్యత వహించాలి.ఇటువంటి వారి ఓబీపీఎస్‌ లైసెన్స్‌ ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. ఆక్యుపెన్సీ దశలో ఎల్‌టీపీ ద్వారా అనుమతించదగిన పరిమితుల్లో ఏవైనా తేడాలు గుర్తిస్తే,వారు ఆన్‌లైన్‌లో చెల్లింపు చలానా పెంచి, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసేముందు చెల్లింపులను నిర్ధారించుకోవాలి.అంతేకాకుండా ఆమోదించిన ప్లాన్‌కు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని గమనిస్తే, సంబంధిత అధికారికి ఎల్‌టీపీలు సమాచారం ఇచ్చి, ఆ తర్వాత పర్యవేక్షణను నిలిపేయాలి. అక్రమాలకు యజమాని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Updated Date - Jul 14 , 2025 | 04:45 AM