New Medical Colleges: తొలి విడత పీపీపీకి 4 వైద్య కళాశాలలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:04 AM
కొత్త వైద్య కళాశాలలను దశల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది..
ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల..
మిగిలిన ఆరు కాలేజీలకూ ఆర్‌ఎ్‌ఫసీ సిద్ధమయ్యాక టెండర్లు
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కొత్త వైద్య కళాశాలలను దశల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ ద్వారా అభివృద్ధి చేయాలని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు సిద్ధం చేసిన ఆర్‌ఎ్‌ఫపీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కాలేజీలను పీపీపీకి ఇవ్వనున్నారు. మిగిలిన ఆరు కాలేజీలు ఫీజుబులిటీ రిపోర్టు, డ్రాఫ్ట్ ఆర్‌ఎ్‌ఫపీ సిద్ధమైన తర్వాత పీపీపీ విధానంలోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పీపీపీ విధానం కోసం కంపెనీలను ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. టెండర్ కమిటీ ప్రీ బిడ్ మీటింగ్ అనంతరం ఆర్‌ఎ్‌ఫపీలో చిన్న చిన్న మార్పులకు ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.