Industrial Policy: పెట్టుబడిదారులకు పూర్తి సహకారం
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:49 AM
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం...
రాష్ట్రానికి వచ్చి పాలసీలు పరిశీలించండి
తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి
దుబాయ్ పారిశ్రామికవేత్తలకు మంత్రి నారాయణ పిలుపు
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దుబాయ్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ, అధికారుల బృందం రెండో రోజు మంగళవారం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, పాలసీలను పరిశీలించి ఆ తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఉదయం అపరెల్ గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్, సీఈఓ నీరజ్, సీబీఓ కమల్ కొటక్‌తో నారాయణ సమావేశమయ్యారు. ఏపీలో వ్యాపారాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో దిగ్గజ సంస్థ ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేశ్ రామకృష్ణన్‌తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయనకు మంత్రి వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో పాటు షిప్ బిల్డింగ్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం బుర్జిల్ హెల్త్‌కేర్ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించారు. అనంతరం దుబాయ్ డౌన్‌టౌన్‌లో ఉన్న తబ్రీద్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి బృందం సందర్శించింది. ఈ కంపెనీ సీఈఓ ఖలీద్, సీడీఓ ఫిలిప్, ఇతర ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ వంటి వాటికి తబ్రీద్ కంపెనీ ఏసీలకు బదులు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలను అందిస్తోంది. దీనికోసం ఆ కంపెనీ ఏర్పాటు చేసిన కూలింగ్ సెంటర్‌ను మంత్రి పరిశీలించారు. అమరావతిలోనూ ఇలాంటి కూలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశాల్లో విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పలు దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారని, దుబాయ్ పెట్టుబడిదారులు కూడా రావాలని మంత్రి ఆహ్వానించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, మున్సిపల్‌శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.