Eagle Chief AKe Ravikrishna: రాష్ట్రంలో 850 గంజాయి హాట్ స్పాట్లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:30 AM
రాష్ట్రంలో 850 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, వాటిపై నిఘా పెట్టి వినియోగదారులు ఎవరో తెలుసుకొని చర్యలు చేపడతామని ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు.
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ
విశాఖపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 850 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, వాటిపై నిఘా పెట్టి వినియోగదారులు ఎవరో తెలుసుకొని చర్యలు చేపడతామని ‘ఈగల్’ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గంజాయి కేసుల్లో ఖైదీలుగా ఉన్నవారితో మాట్లాడి ఈ కేసుల్లో పట్టుబడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వారికి వివరించి, ఇకపై గంజాయి రవాణాకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. అనంతరం జైలు బయట రవికృష్ణ విలేకరులతో మాట్లాడారు. విశాఖ జైలులో మొత్తం 1,800 ఖైదీలు ఉంటే వారిలో 1,008 మంది గంజాయి కేసులకు సంబంధించినవారేనన్నారు. వారిలో చాలామందికి చట్టాలపై అవగాహన లేదన్నారు. గంజాయి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. గంజాయి వ్యాపారుల ఆచూకీ తెలిస్తే 1972కు సమాచారం అందించాలని కోరారు. అల్లూరి జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, ప్రస్తుతం ఒడిశా నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతోందని చెప్పారు. సుమారు 81 చెక్‌పోస్టులు పెట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు వస్తున్నట్టు గమనించామన్నారు. అల్లూరి జిల్లాలో 35 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులకు ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా సహకారం అందిస్తుందని చెప్పారు. గంజాయి కేసుల్లో రెండు, మూడు సార్లు జైలుకెళ్లి వచ్చిన వారు కూడా బయట ఉన్నారని, ఇలాంటి 4,700 మందిని గుర్తించి సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నామని చెప్పారు. డాక్టర్లు సిఫారసు చేయకుండానే మత్తు కలిగించే మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామన్నారు. గంజాయి స్మగర్ల ఆస్తులను కూడా జప్తు చేయబోతున్నామని, ఇలాంటి కేసులు 55 వరకు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 40వేల విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి.. గంజాయి, పొగాకు ఉత్పత్తులు తీసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నామన్నారు.