Share News

High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:40 AM

ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఆరు నెలల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు

  • 6 నెలల్లో కల్పించాలని హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఆరు నెలల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో ట్రాన్స్‌జెండర్‌ అయిన పిటిషనర్‌ను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడేనికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ కె.రేఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ హిందీ పోస్టులకు దరఖాస్తు చేశారు. జిల్లాలో 671వ ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి పోస్టులు నోటిఫై చేయకపోవడంతో అధికారులు ఆమెను పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై రేఖ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.సాల్మన్‌రాజు వాదనలు వినిపిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా 16వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం 2025లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు పోస్టులు కేటాయించలేదని, ఇది నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ... ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అది లేనప్పుడు రిక్రూట్‌మెంట్‌ను తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి...ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఆరు నెలల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాల్లో ట్రాన్స్‌జెండర్ల సమాజం ఒకటి. కేంద్రం ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం-2019 తీసుకొచ్చింది. అయినప్పటికీ విద్య,ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎలాంటి రిజర్వేషన్‌ కల్పించడం లేదు. వీరి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఉద్యోగాల్లో వారికి అవకాశాల ్జకల్పనకు ప్రభుత్వం నుంచినిర్దిష్ట చర్య అవసరం’ అని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 05:41 AM