Tourism Development: కారవాన్ టూరిజానికి ఓకే.. ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:14 AM
రాష్ట్రంలో కారవాన్ టూరిజంలో సరికొత్త అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. టూరిజం పాలసీలో కారవాన్ టూరిజాన్ని కూడా చేర్చుతూ పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్...
రూ.ఐదు కోట్ల వరకు ప్రోత్సాహకం
ఐదేళ్లలో 25 కారవాన్ పార్కుల ఏర్పాటు
150 కారవాన్ వాహనాలు అందుబాటులోకి
ఏపీ టూరిజం పాలసీలో ’కారవాన్’ను భాగం చేస్తూ పర్యాటక శాఖ ఉత్తర్వులు
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కారవాన్ టూరిజంలో సరికొత్త అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. టూరిజం పాలసీలో కారవాన్ టూరిజాన్ని కూడా చేర్చుతూ పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు తరహాలో అక్కడి మార్గదర్శకాలతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. కారవాన్లు, కారవాన్ పార్కుల ఏర్పాటుకు రూ.ఐదు కోట్ల వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. రాబోయే ఐదేళ్లలో 25 కారవాన్ పార్కులను అభివృద్ధి చేయాలని, 150 వరకూ కారవాన్ వాహనాలను టూరిజంలో భాగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఐదు వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. మరోవైపు 20శాతం మేర పర్యాటకుల సంఖ్య కూడా పెరగవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కారవాన్ వాహన నిర్వహకులు తమ ప్రయాణికులకు తప్పనిసరిగా బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. రవాణా విభాగం నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. లైఫ్ టాక్స్‌లో కొంత మినహాయింపు ప్రభుత్వం ఇస్తుంది. కారవాన్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూమిని వారే సేకరించుకోవాలి. ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకోవాలంటే టూరిజం పాలసీలోని నిబంధనలు పాటించాలి.