Awareness Program: డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వ యుద్ధం
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:12 AM
డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద యుద్ధమే చేస్తోందని ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ అన్నారు.
ఇప్పటివరకు 34 వేల కిలోల గంజాయి సీజ్
ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ వెల్లడి
గుడివాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద యుద్ధమే చేస్తోందని ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ అన్నారు. ఆదివారం నిర్వహించిన గుడివాడ సైక్లోథాన్-2025 సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈగల్ టీమ్‌ల్లో అందరినీ భాగస్వాములను చేస్తూ పాఠశాల, కళాశాలల్లో ఇప్పటికే 40 వేల ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలిసీ తెలియక కేసుల్లో ఇరుక్కుపోయి చాలామంది జైలు జీవితం గడుపుతున్నారని, ఇలాంటి వారిని కేసు స్టడీగా తీసుకుని తల్లిదండ్రులు తమ చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపరేషన్ చైతన్యంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేకుండా చేశామని చెప్పారు. గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రెండు నెలల కిందట ఢిల్లీలో జరిగిన సమావేశంలో కొనియాడారని గుర్తుచేశారు. ఒడిశా నుంచి గంజాయి సరఫరా జరుగుతున్నట్లు గుర్తించామని, రవాణా వ్యవస్థపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 1,400 కేసులు నమోదు చేశామని, 18,336 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని రవికృష్ణ వివరించారు. పొగాకు రహిత విద్యాసంస్థల కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్‌ను ప్రారంభించామని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడను ప్రారంభించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.12 కోట్ల విలువైన స్మగ్లర్ల ఆస్తులను సీజ్ చేశామని, మరో 200 మందిని గుర్తించామని ఐజీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.